15-01-2026 03:00:57 AM
కృతజ్ఞతలు తెలిపిన మెస్రం వంశస్థులు, గిరిజనులు
ఉట్నూర్, జనవరి 14(విజయక్రాంతి): రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చే ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. జాతర సందర్భంగా రోడ్ల మరమ్మత్తులు చేపట్టారు. ‘మరమ్మత్తులకు నోచని నాగోబా రోడు’ అనే శీర్షికతో మంగళవారం ‘విజయక్రాంతి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు బుధవారం రోడ్లకు మరమ్మత్తులను ప్రారంభించారు. సమస్యను పరిష్కరించిన ‘విజయక్రాంతి’ దినపత్రికకు, జిల్లా కలెక్టర్ రాజర్షిషాకు మెస్రం వంశస్థులు, గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.