29 July, 2026 | 8:54 AM

జూడాల సమ్మె యథాతథం

25-06-2024 02:42 AM
  • వైద్యారోగ్య శాఖ మంత్రి చర్చలు అసంపూర్ణం 

8 అంశాలపై రాజనర్సింహతో చర్చించిన జూడాలు

మరోసారి మంత్రితో చర్చలకు వస్తామని స్పష్టం

హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో/ఆదిలాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రితో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో జూనియర్ డాక్టర్ల సమ్మె యథాతథంగా కొనసాగనుంది. మంత్రితో సోమవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయని జూడాలు ప్రకటించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జూడాలు మంత్రి దామోదర్ రాజనర్సింహతో చర్చలు జరిపారు.

ప్రతి అంశంపైనా మంత్రితో చర్చించామని, కానీ కొన్ని అంశాల్లోనే సానుకూలంగా స్పందించారని జూడాలు మీడియాతో తెలిపారు. కానీ అంతిమంగా తమ సమస్యలకు పరిష్కారం మాత్రం కనిపించలేదని, మరోసారి మంత్రితో చర్చిస్తామని వారు వెల్లడించారు. తమ డిమాండ్లకు సంబంధించిన అంశాలన్నింటిపై ఉన్నతాధికారులకు మంత్రి ప్రతిపాదనలను పంపించినట్లు జూడాలు తెలిపారు. వైద్యుల భద్రతపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత వెల్లడిస్తామని, ఉపకార వేతనాల చెల్లింపునకు గ్రీన్ చానెల్‌పై మరోసారి చర్చించి నిర్ణయం తీసు కుంటామని మంత్రి తెలిపారని వెల్లడించా రు.

వసతి గృహాల్లో సమస్యలు, కేఎంసీ రోడ్ల కు సంబంధించి వైద్యశాఖ నుంచి ఆర్థిక శాఖకు ఇప్పటికే ఫైల్ పంపించినట్లు తెలియజేశామని, గ్రీన్ చానెల్ విధానం విజయ వంతమైతే భవిష్యత్తులో కొనసాగిస్తామని, వైఫల్యం చెందితే మరోసారి సమీక్షిస్తామని మంత్రి తెలిపారని అన్నారు. ప్రస్తుతానికి సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జూడాలు స్పష్టం చేశారు. సమ్మె కొనసాగింపుపై రాష్ట్ర స్థాయి జూడాలతో చర్చించి నిర్ణ యం తీసుకుంటామని తెలిపారు. అయితే జూడాల సమస్యలపై ఏ అంశంలోనూ క్లారి టీ రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 వేల మంది జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. 

ఈ నెల 21 నుంచి...

తమ సమస్యలు నెరవేర్చాలంటూ ఈ నెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జూడాలు నిరసన తెలుపుతున్నారు. ఉపకార వేతనాల చెల్లింపుతో పాటు దీర్ఘకాలికంగా ఎదుర్కుంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అయితే సర్కారు మాత్రం స్పందించలేదు. దీంతో జూడాలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను బహిష్కరించి జూడాలు సమ్మె బాట పట్టారు. అత్యవసర వైద్య సేవలకు మాత్రం అంతరాయం కలిగించడంలేదు. ఇప్పటికే వీరి నిర్ణయంతో పలు ఆసుపత్రుల్లో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 

డిమాండ్లు ఇవీ.. 

  1. గ్రీన్ చానెల్- ఏర్పాటు చేసి సకాలంలో స్టుపెండ్ విడుదల
  2. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు సరైన గౌరవ వేతనం
  3. తెలంగాణలో ఏపీ విద్యార్థులకు 15 శాతం సీట్ల రిజర్వేషన్ల తొలగింపు
  4. వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో భద్రతా సమస్యల పరిష్కారం
  5. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా హాస్టల్ సౌకర్యాలు 
  6. ఉస్మానియా జనరల్ హాస్పిటల్  కోసం కొత్త భవన నిర్మాణం
  7. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు 
  8. కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు నిర్మించడం 

మరోసారి చర్చించి నిర్ణయిస్తామన్నారు : డాక్టర్ శ్రీహర్ష

స్టుపెండ్ విషయంలో గ్రీన్ ఛానల్‌పై మారో మారు చర్చించి నిర్ణయిస్తామని మంత్రి తెలిపారు. కాకతీయ వర్సిటీలో రోడ్లు సహా హాస్టల్ ఏర్పాట్లపై ఇప్పటికే ఆర్థిక శాఖకు ఫైల్ పంపించినట్లు మంత్రి వివరించారు. వైద్యుల భద్రత గురించి ఇప్పటివరకు ఎలాంటి చర్చా జరగలేదని, పోలీసు అధికారులతో చర్చించి చెప్తామన్నారు. కొత్త మెడికల్ కాలేజీలకు బస్ ఏర్పాట్లపై డీఎంఈతో చర్చించమని మంత్రి తెలిపారు. డీఎంఈని కలిసి ఈ అంశంపై చర్చిస్తాం. సమ్మెపై రాష్ర్ట స్థాయి జూడాలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం. . 

సమస్యలను పరిష్కరించాలి

తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని జూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఇసాక్‌న్యూటన్, ఉస్మానియా అధ్యక్షుడు డాక్టర్ దీపాంకర్, ప్రధానకార్యదర్శి డాక్టర్ చంద్రికరెడ్డి ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. జూడాలు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల, ముషీరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జూడాలు ఆందోళన నిర్వహించారు. ఉస్మానియా వద్ద జరిగిన ధర్నాలో ఇసాక్‌న్యూటన్, దీపాంకర్, చంద్రికరెడ్డి మాట్లాడుతూ నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

రిమ్స్‌లో నిరసన 

తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుతానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని రిమ్స్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ అధ్య క్షుడు సందీప్‌చారి ఆరోపించారు. రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు సోమవారం నుంచి ఓపీ సేవలను బహి ష్కరించి సమ్మెలో పాల్గొంటున్నామని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఎమర్జెన్సీ తప్ప ఇతర సేవలు అందివ్వబోమని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజుయాదవ్, కార్తీక్, సురజ్, కోశాధికారి బాలమురుగణ్, జహ్నావి, రష్మీ పాల్గొన్నారు.