ఉప్పల్ - ఘట్‌కేసర్ ఫ్లు ఓవర్‌కు కొత్త టెండర్లు
- ప్రస్తుత కాంట్రాక్టర్ టెర్మినేట్
- ఆదేశాలు జారీచేసిన కేంద్ర మంత్రి గడ్కరీ
- యుటిలిటీ ఛార్జీల హామీతో ట్రిపుల్ ఆర్‌లో కదలిక
- ఎన్నికల వల్లే ట్రిపుల్ ఆర్, విజయవాడ 6 లేన్ ఆలస్యం
- 16 రాష్ట్ర రోడ్లను హైవేలుగా మార్చాలని విజ్ఞప్తి
- గడ్కరీతో భేటీ అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): చాలాకాలంగా జంటనగర వాసులనే కాకుండా రాష్ట్రంలోని అనేక జిల్లాల ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్న ఉప్పల్ ఘట్ కేసర్ ఫ్లుఓవర్ కాంట్రాక్టర్‌ను టెర్మినేట్ చేసి, కొత్త టెండర్లు పిలిచి పనులు పూర్తిచేయాలని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అందుకు నితిన్ గడ్కరీకి రాష్ర్ట ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తరఫున కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు. నాలుగేండ్లుగా ఫ్లు ఓవర్ పనులు నత్తనడకన సాగుతున్న విషయం గడ్కరీ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించారని తెలిపారు.
రాష్ట్రానికి సంబందించిన పలు జాతీయ రహదారుల అంశంపై న్యూఢిల్లీలో నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియతో మాట్లాడారు. గత ప్రభుత్వం యుటిలిటీ చార్జీలు కట్టబోమని కేంద్రానికి లేఖ రాయడంతో ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాను, సీఎం రేవంత్‌రెడ్డి కలిసి యుటిలిటీ చార్జీలు చెల్లిస్తామని కేంద్రానికి లేఖ రాశామని గుర్తుచేశారు. దీంతోపాటు రాష్ర్ట ఆర్థిక ఇబ్బందులను నితిన్ గడ్కరీకి వివరిస్తే వారే స్వయంగా యుటిలిటీ చార్జీలు చెల్లిస్తామని చెప్పారని పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు ముందుకు కదిలిందని అన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రతీరోజు 60 వేల వాహనాలు ప్రయాణిస్తాయని, జీఎమ్మాఆర్ సంస్థ టోల్ రోడ్డు పనులు తీసుకొని 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికి వివిధ కారణాలతో ఆలస్యం చేస్తున్నదని కోమటిరెడ్డి విమర్శించారు.
ఈ రహదారిపై రోజూ ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు రోడ్డు పరిస్థితిని వివరిస్తే ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లు గుర్తించి.. మరమ్మతుల కోసం గడ్కరీ రూ.375 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. నిధులున్నా పనులు చేయాల్సిన జీఎమ్మార్ సంస్థ రెండుసార్లు కోర్టుకు పోయి పనులు చేయకపోతే.. మూడోసారి టెండర్ పిలిచి ఆదివారం పనులు ప్రారంభించిందని వివరించారు. డిసెంబర్‌లోపు టెంపరరీ రిలీఫ్ కోసం పనులు పూర్తి చేస్తామని వెంకట్‌రెడ్డి తెలిపారు.
రీజినల్ రింగ్ రోడ్డు కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తానని గడ్కరీ తెలిపారని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెండింగ్‌లో ఉన్న 16 రాష్ర్ట రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని మరోసారి విజ్ఞప్తి చేశామని, అందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆ 16 రోడ్లకు జాతీయ రహదారుల సంఖ్యను కేటాయించాలని విన్నవించినట్లు కోమటిరెడ్డి చెప్పారు. భారత్‌మాల క్రింద రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మారుస్తామని, త్వరలో మంజూరు చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వివరించారు. రాష్ర్టంలో రహదారుల నిర్మాణానికి కావాల్సిన అటవీ అనుమతుల కోసం కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలవనున్నట్టు తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో భేటీ
గత పదేండ్లుగా తెలంగాణలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఢిల్లీలో సోమవారం రాత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రి పదవిని అధిష్ఠించినందుకు అభినందనలు తెలియచేశారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరగా... అందుకు బండి సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా జాతీయ రహదారుల మంజూరులో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారని కోమటిరెడ్డి వెల్లడించారు.






