భూములివ్వండి
- రాష్ట్రానికి 2,500 ఎకరాల రక్షణశాఖ భూములు కావాలి
- రక్షణశాఖ పరిధిలో 2,462 ఎకరాల రాష్ట్ర భూమి
దానికి బదులుగా రక్షణశాఖ భూములు ఇవ్వండి
రహదారుల విస్తరణ, ఫ్లు ఓవర్ల నిర్మాణానికి అవసరం
వరంగల్‌లో సైనిక్ స్కూల్‌కు మళ్లీ అనుమతివ్వండి
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్ వినతి
రాష్ట్రానికి 2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయాలి
కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిని కోరిన సీఎం
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కోసం రక్షణ శాఖకు చెందిన 2,500 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూమిని ఇమారత్ పరిశోధన కేంద్రం (ఆర్‌సీఐ) ఉపయోగించుకుంటున్నదని విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లుఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ భూములు అవసరమని తెలిపారు.
ఆర్‌సీఐ రాష్ర్ట ప్రభుత్వ భూములను వినియోగించుకుంటున్నందున రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలను తమకు అప్పగించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి సోమవారం రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో కూడా సమావేశమయ్యారు. రాష్ర్ట ప్రభుత్వం, రక్షణ శాఖ భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వరంగల్ నగరానికి గతంలో సైనిక్ స్కూల్ మంజూరు చేసినా, గత రాష్ర్ట ప్రభుత్వం నిర్మాణపరంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో అనుమతుల గడువు ముగిసిందని, ఇప్పుడు మళ్లీ అనుమతులు పునరుద్ధరించాలని లేదా తాజాగా మంజూరు చేయాలని కోరారు.
2.70 లక్షల ఇళ్లు ఇవ్వండి
2024- 25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్‌సీ మోడల్‌లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని వివరించారు. రాష్ర్టంలో తాము నిర్మించదల్చిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షలు ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం (బీఎల్‌సీ) పద్థతిలో నిర్మించనున్నట్లు తెలిపారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజనను (పట్టణ) -పీఎంఏవై (యూ) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున, 2024- 25 సంవత్సరానికి పీఎంఏవై (యూ) కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని, రాష్ర్టంలో తాము నిర్మించే ఇళ్లను పీఎంఏవై (యూ) మార్గదర్శకాల ప్రకారం నిర్మిస్తామని ఖట్టర్‌కు సీఎం వివరించారు. పీఎంఏవై (యూ) కింద ఇప్పటివరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి రూ.2,390.58 కోట్లు గ్రాంటు కింద ప్రకటించారని, ఇందులో ఇప్పటివరకు రూ.1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగతా నిధులు విడుదల చేయాలని కోరారు.
స్మార్ట్ మిషన్ పనులు ఏడాది పొడిగించాలి
స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టే పనులు పూర్తి కానుందున మిషన్ కాల పరిమితిని 2025, జూన్ వరకు పొడిగించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద తెలంగాణలో వరంగల్, కరీంనగర్ నగరాల్లో పనులు చేపట్టినట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ కింద వరంగల్‌లో 45 పనులు పూర్తయ్యాయని, రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయని, కరీంనగర్‌లో 25 పనులు పూర్తయ్యాయని, రూ.287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితి ఈ ఏడాది జూన్ 30తో ముగుస్తోందని, ప్రజా ప్రయోజనార్ధం పనులు ముగిసేవరకు మిషన్ కాలపరిమితిని మరో ఏడాది పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో నాగర్‌కర్నూల్, ఖమ్మం, మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరి, నల్లగొండ, వరంగల్, పెద్దపల్లి ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కమార్ యాదవ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్‌రెడ్డి ఉన్నారు.






