కాంగ్రెస్ గ్యారెంటీల గారడీ
ఏం చేశారని విజయోత్సవాలు
బిజెపి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ విమర్శించారు. మంగళవారం బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి సీనియర్ నాయకులు, మాజీ జెడ్పిటిసి సభ్యుడు అరిగేలా నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ మల్లికార్జునరావులతో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావోస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ 6 అబద్దాలు, 66 మోసాలతో గ్యారెంటీల గారడి చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన అంటేనే గారడి అని ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ పూర్తి అమలు చేయలేదని, రైతులకు రైతు బరోసా 15 వేలు అని చెప్పిన రెండో పంట వచ్చిన భరోస ఏదని ఆయన ప్రశ్నించారు.
రైతు కూలీలకు 12 వేలు ఎక్కడ పోయాయని, మహిళలకు జీరో వడ్డీ రుణాలు ఏవని, మహాలక్ష్మీ 2,500 రూపాయలు, స్కూటి, తులం బంగారం ఇస్తానని మహిళలను మోసం చేసారని విమర్శించారు. యువకులకు లక్షల విద్యా భరోస, నిరుద్యోగ ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి 4 వేలు అని చెప్పి మోసం చేసారని అన్నారు. పేదల ఇందిరమ్మ ఇండ్లు ఏవని, వృద్దులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు 4 వేల పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. మోసాలతో కాంగ్రెస్ పాలన చేపట్టిందని, వారి మోసాలను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో హైడ్రా పేరిట కూల్చివేతలు, బెదిరింపులు, కక్షసాధింపు చర్యలు, అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై చార్జి సీటును విడుదల చేశారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా నాయకులు ఖాండ్రే విశాల్, అరుణ్, ప్రసాద్ గౌడ్, పెంటయ్య, వెంకన్న, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




