3 June, 2026 | 6:54 PM

పంచాయతీ సిబ్బందికి న్యాయం చేయాలి

03-06-2026 05:52 PM

ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా.. అధికారులకు వినతిపత్రం

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలంలోని గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వాంకిడి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం గ్రామపంచాయతీ ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వాంకిడి ఎంపీడీవో ఎంపీడీవో పాటిల్ జోత్స్న, ఎంపీఓ ఖజా అజీజ్ ఉద్దీన్ లకు అందజేశారు. అనంతరం యూనియన్ కొమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీకాంత్ మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

రెగ్యులరైజేషన్ జరిగే వరకు సుప్రీంకోర్టు తీర్పు, ప్రభుత్వ జీవో ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం అందిస్తున్న వేతనాలను ప్రతి నెల మొదటి తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.పంచాయతీ సిబ్బందిపై అదనపు భారం మోపుతున్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సంక్షేమ పథకాలను అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో నమోదు కాని సిబ్బంది పేర్లను వెంటనే నమోదు చేసి ప్రభుత్వ పరంగా గుర్తింపు కల్పించాలని కోరారు.

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమం పంచాయతీ సిబ్బంది హక్కుల సాధన కోసం నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో నిరవధిక సమ్మె చేపట్టేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ధర్నాలో మండలంలోని వివిధ గ్రామపంచాయతీల సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్లను వివరిస్తూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.