3 June, 2026 | 6:26 PM

అభివృద్ధి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య

03-06-2026 05:55 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య (మున్సిపల్_అడ్మిన్)తో కలిసి బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. బెల్లంపల్లి పట్టణానికి గోదావరి నుంచి మంచినీటిని అందించాలని ప్రయత్నంలో భాగంగా చేపట్టిన అమృత్ 2.0 పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు నత్త నడకన సాగడంతో త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను,కాంట్రాక్టర్ ను ఆదేశించారు.. పట్టణ డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు.

చైర్ పర్సన్ దావ స్వాతి  డంపింగ్ యార్డ్ సమస్యను అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, డంపింగ్ యార్డ్ ఏర్పాటు కొరకు రెండు స్థలాలను పరిశీలించారు. 65 డిప్ ఏరియాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మించే ప్రదేశంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులకు సంబంధించి సమస్య ఉందని తెలుపగా సంబంధిత అధికారులతో అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు. అదేవిధంగా పట్టణంలోని ప్రధాన రహదారిని ఆనుకొని నిర్మించిన అక్రమ షెడ్ లను తొలగించాలని, పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

రోడ్లపై వ్యాపారాలు చేసుకుంటున్నా చిరు వ్యాపారులకు ప్రత్యమ్న్యాయ స్థలాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని నూతనంగా ఇండ్లకు రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో ఏదైనా అత్యవసర పరిస్థితులలో ప్రజలు తమకు చెందిన ఇంటిని కాని స్థలాన్ని కానీ తనాఖా పెట్టాలన్నా, విక్రాయించాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నారని అదనపు కలెక్టర్ విన్నవించారు. కాబట్టి బెల్లంపల్లి పట్టణంలోని ఇళ్లకు, స్థలాలకు రిజిస్ట్రేషన్లు అయ్యేలా చూడాలని అడిషనల్ కలెక్టర్కు బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్, స్థానిక కౌన్సిలర్లు వినతి పత్రం అందజేశారు. అనంతరం పట్టణంలోని పలు బస్తీలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సంబంధిత లబ్ధిదారులకు సూచించారు.