15 July, 2026 | 12:04 AM

జ్యోతి పసిడి వెలుగులు

28-04-2024 12:19 AM

ఆర్చరీ ప్రపంచకప్‌లో మూడు స్వర్ణాలు

షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత ఆర్చర్ల గురి అదిరింది. తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ స్వర్ణాలతో సత్తా చాటింది. ఇక శనివారం జరిగిన పలు ఈవెంట్ ఫైనల్స్‌లో భారత్ ఐదు పతకాలు సాధించి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత సురేఖ మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో మెక్సికోకు చెందిన ఆండ్రియా బిసెర్రాను 146 ఓడించి స్వర్ణం సాధించింది. అనంతరం కాంపౌండ్ మిక్స్‌డ్, మహిళల కాంపౌండ్ విభాగంలోనూ సురేఖ బంగారు పతకాలను కైవసం చేసుకుంది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సురేఖ వర్మ జోడి ఫైనల్లో 158 తేడాతో ఎస్తోనియా జంటపై విజయం సాధించింది.

మహిళల కాంపౌండ్ విభాగంలో సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్‌తో కూడిన బృందం ఇటలీ త్రయంపై 236 తేడాతో గెలిచి స్వర్ణం గెలుచుకుంది. ఈ నేపథ్యంలో భారత్ తరపున ఆర్చరీ ప్రపంచకప్‌లో ట్రిపుల్ గోల్డ్ మెడల్స్ సాధించిన రెండో ఆర్చర్‌గా సురేఖ నిలిచింది. ఇంతకముందు మాజీ నంబర్ వన్ దీపికా కుమారి 2021 పారిస్ ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించింది. ఇక పురుషుల టీమ్ ఈవెంట్‌లో అభిషేక్, ప్రియాన్ష్, ప్రథమేశ్‌తో కూడిన భారత బృందం నెదర్లాండ్స్ త్రయంపై 238 తేడాతో అలవోక విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక పరుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో ప్రియాన్ష్.. 150 147తో ఓడి రజతం సాధించాడు.