15 July, 2026 | 12:12 AM

గుజరాత్ x బెంగళూరు

28-04-2024 12:18 AM

అహ్మదాబాద్:  ఐపీఎల్ 17వ సీజన్‌లో నేడు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. గుజరాత్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉండగా.. బెంగళూరు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీతో మ్యాచ్‌లో కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన గుజరాత్.. బెంగళూరుపై విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌ను వారి సొంతగడ్డపై ఓడించి వరుస పరాజయాలకు చెక్ పెట్టిన బెంగళూరు గుజరాత్‌ను ఓడించాలని చూస్తోంది. గుజరాత్ బ్యాటింగ్ విభాగానికి వస్తే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లు ఈ సీజన్‌లో 300 పరుగులకు పైగా సాధించి జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు.

అయితే మిల్లర్, షారుక్ ఖాన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియాలతో కూడిన మిడిలార్డర్ విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే బౌలింగ్‌లో మాత్రం గుజరాత్ కాస్త బలంగా కనిపిస్తోంది. పేసర్ మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ సహా  స్పిన్నర్లు రషీద్ ఖాన్, సాయి కిషోర్‌లు వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక బెంగళూరు బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీనే జట్టుకు మరోసారి కీలకంగా మారనున్నాడు. 430 పరుగులతో కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో దూకుడు ప్రదర్శించిన రజత్ పాటిదార్ మరోసారి చెలరేగితే గుజరాత్‌కు కష్టాలు తప్పవు. ఇక ఫినిషర్‌గా దినేశ్ కార్తిక్ అదరగొడుతున్నాడు. బెంగళూరు బౌలింగ్ విభాగం మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. సిరాజ్, యష్ దయాల్, కర్ణ్ శర్మ,  ఫెర్గూసన్, కామెరున్ గ్రీన్ రాణించాల్సిన అవసరముంది.