పేదలపై ప్రతాపం.. పెద్దలకు సలాం!
మూసీలో బహుళ అంతస్తులు అధికారులకు కనబడటం లేదా?
అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలేవీ?
ప్రభుత్వ తీరుపై కల్వకుంట్ల కవిత ఫైర్
నార్సింగిలో ఉద్రిక్తత.. కవిత అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 (విజయక్రాంతి): హైడ్రా కూల్చివేతలు కేవలం పేద, మధ్యతరగతి వర్గాలనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని, బడా ఆక్రమణదారుల విషయంలో ప్రభుత్వం మోకరిల్లుతోందని భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
మంగళవారం నార్సింగి పరిధిలోని శ్రీ ఆదిత్య రీగల్ రెసిడెన్సెస్ వద్ద తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మీడియాలో మాట్లాడిన ఆమె.. నగరంలోని చెరువులు, కుంటల పరిరక్షణ పేరుతో హైడ్రా అధికారులు పేదవాడి పొట్ట కొడుతున్నారని, అదే సమయంలో మూసీ నది గర్భంలో వెలుస్తున్న భారీ బహుళ అంతస్తుల భవనాలను చూసీచూడనట్లు వదిలే స్తున్నారని మండిపడ్డారు. మూసీ నది మధ్య లో నిర్మిస్తున్న బిల్డింగులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ఎందుకు కనబడటం లేదని నిలదీశారు.
నిబంధనల ప్రకారం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇతర నిర్మాణాలకు 30 మీటర్ల దూరం ఉండాలని నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం, కొందరు పెద్దల భవనాలు కేవలం 5 మీటర్ల దూరంలోనే ఉన్నా ఎలా అనుమతులు ఇస్తోందని, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటని ఆమె ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ పరిధిలో అభాగ్యుల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని, అలాగే ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో సుమారు 600 మంది అమాయక పేదల ఇళ్లను అక్రమంగా నేలమట్టం చేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగం గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలకు గురైన చెరువులు, ఇతర నీటి వనరుల గురించి తాము ఎన్నో ఆధారాలతో ఫిర్యాదులు చేసినా, ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేసిందని ఆమె ఎద్దేవా చేశారు. బడాబాబుల అక్రమ కట్టడాలపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోందన్నారు.
గాంధీ సరో వర్ ప్రాజెక్టు విషయంలో కూడా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని, 20 ఏళ్లుగా అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న సామాన్యులను ఇప్పుడు ఇబ్బందులకు గురి చేయడం దారుణమని ఆమె పేర్కొన్నారు. ఆరు నెలల పాటు నిలిచిపోయిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు అకస్మాత్తుగా ఎవరి ప్రయోజ నాల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల ఇండ్లను కూల్చినందుకు ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మూసీ ఆక్రమణలపై ప్రభుత్వం, హైడ్రా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకునే వరకు భారత జాగృతి ఆధ్వర్యంలో న్యాయపోరాటం, క్షేత్రస్థాయి పోరాటం కొనసాగుతుందని కవిత తేల్చి చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు బలప్రయోగంతో కవితను అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, కవిత అరెస్టును నిరసిస్తూ నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదుట భారత జాగృతి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బైఠాయించి ఆందోళన చేపట్టారు.
అనుమతులతోనే నిర్మాణాలు: హైడ్రా
ఆదిత్య బిల్డర్స్‌పై కవిత చేసిన ఆరోపణలపై హైడ్రా ఉన్నతాధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఆదిత్య బిల్డర్స్‌కు నిర్మాణ అనుమతులు బీఆర్‌ఎస్ హయాంలోనే మంజూ రయ్యాయని హైడ్రా స్పష్టం చేసింది. మూసీలోకి జరిగి రిటైనింగ్ వాల్ నిర్మించడంతో అప్పట్లో అనుమతులు రద్దయ్యాయని, దీంతో ఆదిత్య బిల్డర్స్ హైకోర్టును ఆశ్రయించారని చెప్పింది. విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలతో ఆదిత్య బిల్డర్స్ మూసీలో కట్టిన రిటైనింగ్ వాల్‌ను తొలగించిందని, వెనక్కు జరిగి నిర్మాణాలు చేపడతామని కోర్టుకు నివేదించడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నివేదికలు, ఆదిత్య బిల్డర్స్ ఇచ్చిన రాతపూర్వక హామీని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నిర్మాణ అనుమతులను పునరుద్ధరించిందని హైడ్రా వెల్లడించింది. హైకోర్టు అనుమతుల మేరకే ప్రస్తుతం అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ పరిణామాలు హైడ్రా రాకముందే జరిగిపోయాయని అధికారులు చెప్పారు.




