16 July, 2026 | 9:26 PM

కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్

12-06-2024 12:10 AM

ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీపను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 8న రేణుకాస్వామిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మరుసటి రోజు కామాక్షిపాళ్యం సమీపంలో రేణుకాస్వామి మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నటుడు దర్శన్ అనుచరులైన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు దర్శన్ పేరు చెప్పారు. ఈ ఆరోపణల నేపథ్యంలో బెంగళూరు నగర పోలీసులు మంగళవారం తెల్లవారు జామున దర్శన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.

దర్శన్ భార్య పవిత్ర గౌడకు నగరంలోని చితదుర్గ ప్రాంతానికి చెందిన రేణుకాస్వామి అసభ్యకర మెస్సేజ్‌లు పంపినట్టు పోలీసుల విచారణలో వెల్లడయింది. అసభ్యకర సందేశాలు పంపాడన్న కక్షతో దర్శన్, ఆయన భార్య పవిత్ర గౌడ పథకం ప్రకారం రేణుకాస్వామిని హత్య చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యోదంతానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ కోసం భార్యాభర్తలిద్దరినీ అరెస్ట్ చేసినట్టు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద తెలిపారు.