రవితేజ 75వ చిత్రం ప్రారంభం
రవితేజ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే 75వ చిత్రం మొదలైంది. ఆయన కథానాయకుడిగా నటించనున్న ఈ తాజా సినిమా మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభ మైంది. ఇందులో కథానాయికగా నటించనున్న శ్రీలీల ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్న భాను భోగవరపు తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించటం గమనార్హం. 2025 సంక్రాంతి బరిలో నిలువనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తనదైన వినోదంతో కూడిన మాస్ పాత్రలో రవితేజ ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో; కెమెరా: విధు అయ్యన్న; సంభాషణలు: నందు సవిరిగాన; సమర్పణ: శ్రీకర స్టూడియోస్; కూర్పు: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: నాగేంద్ర తంగాల.






