కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా..!
కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు
మంత్రిగా ప్రమాణం చేసిన 36 గంటల్లోనే రామలింగారెడ్డి రాజీనామా
రాహుల్ గాంధీ ముందు రామలింగారెడ్డి పంచాయతీ
బెంగళూరు అభివృద్ధి శాఖ ఇవ్వలేదని రామలింగారెడ్డి అలక
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో లుకలుకలు బయటపడ్డాయి. శాఖల కేటాయింపు పట్ల అసంతృప్తితో ఉన్న కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బెంగళూరు అభివృద్ధి శాఖను తనకు కేటాయిస్తామని హామీ ఇచ్చారని రామలింగారెడ్డి పేర్కొన్నారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన 13 మంది మంత్రులకు శాఖలను కేటాయించారు. బెంగళూరు అభివృద్ధి శాఖను దక్కించుకోవడంలో రామలింగారెడ్డి పట్టుబట్టారని, అయితే ఆ శాఖ ఆయనకు దక్కలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. శాఖల కేటాయింపుపై గురువారం జరిగిన సమావేశం నుంచి మంత్రి రామలింగారెడ్డి బయటకు వచ్చారని సమాచారం. ఆ సమావేశంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు తనకు 'బెంగళూరు అభివృద్ధి' శాఖను కేటాయిస్తామని 2023లో ఇచ్చిన హామీని మంత్రి ముఖ్యమంత్రికి గుర్తుచేశారు.
రామలింగారెడ్డి అలక
రామలింగారెడ్డి మంత్రిగా ప్రమాణం చేసిన 36 గంటల్లోనే రాజీనామా చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని, 53 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్నానని రామలింగారెడ్డి వివరణ ఇచ్చారు. వీరప్పమొయిలీ, ఎస్.ఎం కృష్ణ కేబినెట్ లో మంత్రిగా పనిచేశానని తెలిపారు. తనకు కేటాయించిన శాఖలపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరు అభివృద్ధి శాఖ ఇవ్వలేదని రామలింగారెడ్డి అలిగారని పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే శుక్రవారం బెంగళూరుకు వెళ్లనున్నారు. రాహల్ గాంధీ ఖర్గే రాజ్యసభ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రామలింగా రెడ్డి అలక పంచాయితీ రాహల్ ముందుకు రానుంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్ కు అప్పగించిన విషయం తెలిసిందే.







