తెలంగాణ ఉద్యమ యోధుడు మురళీధర్ దేశ్ పాండేకు కవిత నివాళి
నాగోల్, జూన్ 10 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు మురళీధర్ దేశ్ పాండే మృతికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం కొత్తపేటలోని ఆయన నివాసానికి వెళ్లిన కవిత, మురళీధర్ దేశ్ పాండే పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో మురళీధర్ దేశ్ పాండే చేసిన సేవలు చిరస్మరణీయమని కవిత పేర్కొన్నారు.
సామాజిక న్యాయం, ప్రజా హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని అన్నారు. కాగా, మురళీధర్ దేశ్ పాండే బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కొత్తపేటలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ, సామాజిక సంస్థల నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.






