11 June, 2026 | 3:01 AM

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

11-06-2026 02:25 AM

డేట్ అఫ్ అపాయింట్‌మెంట్‌ను వెంటనే ప్రకటించాలి

టీజీఎస్‌ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమంతు ముదిరాజ్

ముషీరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని టీజిఎస్‌ఆర్టిసి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టిజేఎంయు) వ్యవస్థాపక అధ్యక్షుడు కే.  హనుమంతు ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు డీవికే రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాల్లో టీజీఎస్‌ఆర్టిసి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి డేట్ అఫ్ అపాయింట్మెంట్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్మికుల బకాయిలు, వేతన సవరణ, ఇతర ఇతర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం పట్ల తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదే విధంగా ప్రభుత్వ  ఉద్యోగులతో సమానంగా సమాన వేతనాన్ని ఇవ్వాలన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటిస్తామని హామీ ఇచ్చి, మాట తప్పడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన గురయ్యారన్నారు. ఆర్టీసీలో కొన్ని యూనియన్ల నేతలు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే చొరవ తీసుకొని విలీనం పట్ల చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో యూనియన్ రీజినల్ సెక్రటరీ సుధాకర్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ప్రేమ్ నాథ్, సివిపి రాష్ట్ర యూనియన్ ఉపాధ్యక్షుడు శ్రీనయ్యతో పాటు తదితర ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.