చరిత్రకు వీరోచిత సంతకం కేసీఆర్
- 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదం
- కేసీఆర్ దీక్ష ఉద్యమ గతిని మలుపు తిప్పింది.
- కేసీఆర్ దీక్ష సరికొత్త చరిత్రకు నాంది.
- 'జై తెలంగాణ' అనే రణ నినాదం కేసీఆర్
హైదరాబాద్: 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao) పేర్కొన్నారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఉద్యమగతిని మలుపుతిప్పిందని గుర్తుచేశారు. నాటి కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందన్నారు. రానే రాదు, కానే కాదన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత కేసీఆర్ ది అని హరీశ్ అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారని చెప్పారు.
పదవులే కాదు, తెలంగాణ రాష్ట్రం(Telangana State) కోసం ప్రాణాలు త్యాగం చేసేందుకూ సిద్ధపడ్డ ధీరత్వం కేసీఆర్ ది అని తెలిపారు. తెలంగాణ అజరామర చరిత్రకు వోరోచిత సంతంకం కేసీఆర్ అన్నారు. నవంబర్ 29న కేసీఆర్(KCR) దీక్ష లేకుండా డిసెంబర్ 9 ప్రకటన లేదు, డిసెంబర్ 9 ప్రకటన లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. దశాబ్దాల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది తప్ప పాలకుల దయాదాక్షిణ్యాలతో కాదన్నది అక్షర సత్యం అని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కేసీఆర్ దీక్షా కాలం, ఉద్యమ జ్ఞాపకాలు తన గుండెలో పదిలంగా ఉన్నాయని తెలిపారు. 'జై తెలంగాణ అని నినదీస్తున్నాయి. తెలంగాణ స్ఫూర్తిని నిత్యం రగిలిస్తున్నాయి.' అని హరీశ్ రావు పేర్కొన్నారు.




