కేసీఆరే సూత్రధారి
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపణ
జగిత్యాల, మే 29 (విజయక్రాంతి): ఫోన్‌ట్యాపింగ్‌కు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆరే సూత్రధారి అని ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆ కేసును సీబీఐతో విచారణ చేయిస్తే కేసీఆర్ బాగోతాలు బయటపడతాయన్నారు. జగిత్యాల పట్టణంలోని ఇందిరాభవన్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్‌ట్యాపింగ్ బీఆర్‌ఎస్ భస్మాసుర అస్త్రమని అభివర్ణించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి పోలీసు అధికారులు ఉమ్మడి కరీంనగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు మేడిపల్లి సత్యం, జువాడి నర్సింగరావు, కవంపల్లి సత్యనారాయణ ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర గీతం ‘జయహే జయహే తెలంగాణ’ను కీరవాణి స్వరపరచడాన్ని బీఆర్‌ఎస్ తప్పుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆంధ్రా సినిమాలకు పన్ను మినహాయింపులు ఇచ్చి, ఇప్పుడు ఎవరి మెప్పు కోసమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బీఆర్‌ఎస్‌కే చెల్లిందని దుయ్యబట్టారు.






