బీఆర్‌ఎస్ దేశద్రోహం
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపాటు
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్ అన్నారు. దారుణమైన స్థితికి దిగజారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినవారిని ఉపేక్షించవద్దని కోరారు. తప్పు చేసిన వారిని జైలుకు పంపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, ఇన్ని సంచలనాలు బయటకు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకులు, డ్రగ్స్‌పై చర్యలు అన్న రేవంత్ సర్కారు వేటినీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీస్ అధికారులు కేసీఆర్ ప్రమేయంతోనే జరిగిందన్నారు. కేసీఆర్ తెలంగాణలో ఓ మాఫియాను నడిపించారని ఆరోపించారు. రాజకీయ ప్రయో జనాల కోసం నాయకులు, ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని, చివరకు జడ్జీల ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు అరెస్టున పోలీసు అధికారులే చెబుతున్నారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితునిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. అధిష్ఠానం ఒత్తిళ్లకు లొంగిపోయే మౌనం పాటిస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు.
ఎంపీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బీఆర్‌ఎస్ సృష్టించిన ఫేక్ సినిమా డ్రామా అని తాను ముందే చెప్పినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు. లిక్కర్ కేసులో కవితను గట్టెక్కించేందుకే ఎమ్మెల్యేల కేసును తెరపైకి తీసుకువచ్చారని, కేసీఆర్ అంతటి దారుణ స్థాయికి దిగజారారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాకుండా బ్రౌజింగ్ హిస్టరీ, డేటా కాల్స్, స్నాప్ చాట్ వంటి వాటిని కూడా ట్రాక్ చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అక్రమ సంపాదనను తరలించేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారంటూ లక్ష్మణ్ విమర్శించారు.
కేసీఆర్, హరీశ్‌రావు పేర్లను పోలీసు అధికారులే తమ వాంగ్మూలంలో చెప్పారని అన్నారు. వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన డాటాను కూడా ధ్వంసం చేశారని, ఇది దేశ భద్రతకు తీరని విఘాతమన్నారు. వెంటనే ఫోన్‌ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించి నిస్పాక్షికంగా దర్యాప్తు జరిగేలా చూడాలన్నారు. ఇంత దుర్మార్గాలకు పాల్పడిన కేసీఆర్ అండ్ కో మీద రేవంత్‌రెడ్డి సర్కారు ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తోందని ప్రశ్నించారు.
అందెశ్రీ పాటను తాము స్వాగతిస్తున్నాం...
తెలంగాణ రాష్ట్ర పాటగా అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని తాము స్వాగతిస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. ఈ విషయంలో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. అందెశ్రీ గొప్ప పాటను రాశారని కొనియాడారు. ఈ పాట తెలంగాణ ప్రజలందరికీ ఎంతో ప్రేరణ కలిగించిందని అన్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రకటన వచ్చాకే రాష్ట్ర చిహ్నంపై స్పందిస్తామన్నారు.
కేసీఆర్ పదేళ్ల పాటు అహంకారంతో పరిపాలన చేశారన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా మోదీ హవానే కనిపిస్తోందని తమకు సొంతంగా 375 సీట్లు వస్తాయని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో అనేక మార్పులు చోటుచేసు కోబోతున్నాయని పేర్కొన్నారు. ఐదేళ్లపాటు కాంగ్రెస్ సర్కారు కొనసాగాలని ప్రజాస్వామ్యవాదిగా తాను కోరుకుంటున్నట్లు వెల్ల డించిన లక్ష్మణ్... రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.






