19 April, 2026 | 1:14 PM

కేసీఆర్‌కు ఇప్పటికీ కనువిప్పు కాలే

28-06-2024 12:51 AM

ఫిరాయింపులకు ఆధ్యుడు ఆయనే 

61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకోలేదా? 

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలలోనే పడగొడుతామనలేదా? 

బీఆర్‌ఎస్‌ను జీరో చేయాలన్న కల నెరవేరింది

విద్యుత్‌పై విచారణ కోరింది బీఆర్‌ఎస్ నేత జగదీష్‌రెడ్డే 

రాష్ట్రంకోసం ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తాం

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుభవాన్ని ఉపయోగించుకొంటాం

మీడియాతో ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపులకు బీజం వేసింది బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆరేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమ ర్శించారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని అన్నారు. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న విషయం కేసీఆర్‌కు గుర్తుకు లేదా? అని ప్రశ్నించారు. ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి. అమరవీరుల స్థూ పం వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.

గురువారం ఢిల్లీలోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మా ట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్, హరీశ్‌రావు అన్నారు. వారి మాటలకు బీజేపీ అప్పట్లో వంతపాడింది. ప్రభుత్వాన్ని కూలగొడుతామని బీఆర్‌ఎస్, బీజేపీ రంకెలేశాయి. ప్రభుత్వాన్ని పడగగొట్టాలనుకోవడం కేసీఆర్ భావదారిద్య్రం. ఇప్పటికీ ఆయనకు కనువిప్పు కలగలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓంటింగ్ 16 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌ను ఓడించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కేసీఆర్ గెలిపించారు. కంచుకోటగా చెప్పుకునే మెదక్‌లోనూ బీఆర్‌ఎస్ మూడో స్థానానికే పరిమితమైంది.

సిరిసిల్ల, సిద్దిపేటలో బీజేపీకి అన్ని ఓట్లు పడ్డాయంటే ఆర్ధమేంటి? ఇన్నాళ్లు ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వని కేసీఆర్, ఇప్పుడు ఫామ్‌హౌస్ తలపులు తెరిచారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించాం. అక్కడ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో విపక్ష నేత మాట్లాడే సంప్రదాయం ఉందా? గతంలో కనీసం ఆహ్వానం కూడా లేదు? విద్యుత్ కొనుగోళ్లలపై విచారణ కోరింది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డినే’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుభవాన్ని పార్టీ వినియోగించుకుంటుందని చెప్పారు. జీవన్‌రెడ్డి అలక అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయని, కానీ కాంగ్రెస్ పట్ల ఆయనకున్న నిబద్ధత వారికి అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. ఏక కాలంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.  

పీసీసీ చీఫ్‌గా ఎవరున్నా ఓకే

పీసీసీ అధ్యక్షుడి పదవీ కాలం మూడేళ్లు ఉంటుందని, దీంతో తన పదవి కాలం ముగిసిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ అధిష్ఠానానికి ఇదివరకే చెప్పినట్లు వెల్లడించారు. అధిష్ఠానం పీసీసీ బాధ్యతలు ఎవరికి అప్పగించినా వారితో కలిసి పనిచేస్తానని, తనకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని, అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులున్నారని తెలిపారు. ‘విద్యాశాఖ నా పరిధిలోనే ఉంది. ఇప్పటివరకు అన్ని పరీక్షలు సవ్యంగానే నిర్వహించాం. నిర్ధిష్ట ప్రణాళికతతో ముందుకెళ్తున్నాం.

గతంలో కేసీఆర్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసి మంత్రులను  నియమించకపోయినా మీడియా ప్రశ్నించలేదు. ఇతర రాష్ట్రాలకంటే ఇక్కడి మంత్రులు మెరుగ్గా  ఉన్నారో లేరో ప్రతిపక్షాలు చూడాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం. బడ్జెట్‌లో నిధుల కోసం కేంద్ర మంత్రులను కలుస్తున్నాం. త్వరలో ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రిని కూడా కలిసి రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరతాం. ఆరు గ్యారెంటీలను మలు చేయడమే ధ్యేయంగా పని చేస్తాం’ అని సీఎం పేర్కొన్నారు.

నా కల నెరవేరింది 

పీసీసీ అధ్యక్షుడిగా తన హయాంలో మంచి విజయాలు సాధించామని సీఎం తెలిపారు. పార్టీ అధికారంలోకి రావడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటు బ్యాంక్ శాతం పెరిగిందని గుర్తుచేశారు. కేసీఆర్‌ను గద్దె దింపాలన్న తన జీవిత లక్ష్యం, అలాగే సీఎం కావాలనే తన ఆకాంక్ష నేరవేరాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇక తన ముందు ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణం మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేశారని, అందుకే బీజేపీ బలం పెరిగిందని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసమైందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు వచ్చిన చోట తాము గెలిచామని, బీఆర్‌ఎస్ డిపాజిట్లు కోల్పోయిన చోట బీజేపీ గెలిచిందని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీని లోక్‌సభలో జీరో చేశామని, ఆ పార్టీని సున్నా చేయాలన్న తన కోరిక నేరవేరిందని చెప్పారు. తాను కక్షపూరిత రాజకీయాలకు పాల్పడబోనని స్పష్టంచేశారు.   

ఏపీతో ఎలాంటి సమస్యలు లేవు 

ఎన్నికలు ముగిసినందున రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు. తెలంగాణ ఇస్తామని నాడు సోనియాగాంధీ ఇచ్చిన హామీని నేరవేర్చారని పేర్కొన్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి సమస్యలు లేవని, ఒకవేళ  ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తయ్యాయని, ఎన్నికల నిర్వహణపై మాట్లాడేందుకు బీఆర్‌ఎస్‌కు అవకాశమే లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.