పెట్టుబడుల పేరుతో టోకరా
మూడు వేర్వేరు కేసుల్లో నిందితుల అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి): తక్కువ సమయంలోనే కోట్లాది రూపాయలు సంపాదిం చాలని ఓ కిలాడీ బార్యాభర్తలు ప్లాన్ వేశారు. ఇంకేముంది.. పథకంలో భాగంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అధికంగా ఉండే మాదాపూర్ ప్రాంతంలో మెటలైడ్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. పెట్టిన పెట్టుబడులకు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో తిరిగి చెల్లిస్తామని కస్టమర్లను నమ్మించారు. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కొద్దికాలం క్రమంగా డబ్బులు చెల్లిస్తూ వచ్చారు.
ఇలా ఉద్యోగుల నుంచి సుమారు రూ.70 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించి అనంతరం పరారయ్యా రు. టీ శ్రీధర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మెటలైడ్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, సీఈవో జయంత్ బిస్వాస్, డైరెక్టర్ మౌసమి బిస్వాస్‌పై 2021, 2022 సంవత్సరాల్లో మాదాపూర్, ఆర్‌సీపురం, రాయదుర్గం పీఎస్‌లలో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ టీమ్ మౌసామి బిస్వాస్ (49)ను గురువారం కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు.
శుభోదయం ఇన్‌ఫ్రా పేరుతో
మరో కేసులో ‘శుభోదయం ఇన్‌ఫ్రా ప్రైవే ట్ లిమిటెడ్’ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీ కలపాటపు శ్రీలక్ష్మిప్రసాద్, అకౌంటెంట్ ముం గలూరి వెంకటసత్యసుధీర్‌ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (ఎకానామిక్ అఫెన్సెస్ వింగ్) టీమ్ గురువారం అరెస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే 2017లో శుభోదయం ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ రియల్ సంస్థను ప్రారంభించారు. సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారికి 13 నెలలకు 50 శాతం, 18 నెలలకు 75 , 26 నెలలకు 100 శాతం రిటర్న్‌లు ఇస్తామని నమ్మించి రూ.3 కోట్ల మేర వసూలు చేశారు. కల్లూరి ప్రవీణ్‌రెడ్డితోపాటు మరో ౧౩ మంది బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
క్రిప్టో కరెన్సీ మోసం
ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కాంకు పాల్పడిన కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన కుంజత్‌బెల్ ముజీబ్ సయ్యద్‌ను సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్టిన పెట్టుబడులకు కేవలం 150 రోజుల్లో మూడింతల రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మించి ‘మాక్స్ క్రిప్టో ట్రేడింగ్’ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో షాద్‌నగర్, హైదరాబాద్ సిటీలో సుమారు 52 మంది నుంచి రూ.1.66 కోట్లు పెట్టుబడులు పెట్టించి పరారయ్యాడు. ఫరూఖ్‌నగర్‌కు చెందిన షేక్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.






