క్యాబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వాకిటి శ్రీహరికి బెర్తులు ఖరార్!
నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి, అదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్‌రావుకు చోటు?
విస్తరణపై ఢిల్లీ పెద్దలతో సీఎం, డిప్యూటీ సీఎం చర్చోప చర్చలు
జూలై మొదటి వారంలోనే క్యాబినెట్ విస్తరణ!
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల మొదటివారంలో ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో రాష్ట్ర క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల్లో.. ఎవరికి అవకాశం దక్కుతుందనేది పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తున్నది. క్యాబినెట్‌లో చోటుకోసం పార్టీకి చెందిన పలువురు ఢిల్లీ పెద్దల వద్ద ఎవరికి వారిగా లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఢిల్లీలోనే మకాం వేసి.. తమ పేరును పరిశీలనలోకి తీసుకోవాలని విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి.. సోనియా, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మలిఖార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, దీపాదాసు మున్షీతో చర్చిస్తున్నారు.
కాగా, రాష్ట్ర క్యాబినెట్‌లో ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల్లో ఎవరిని నియమించాలనేదానిపై సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ పెద్దలతో చర్చిస్తున్నారు. వీరితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మంత్రివర్గ కూర్పులో పలు పేర్లు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాలమూరు జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్లు దాదాపుగా ఫైనల్ అయినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు మంత్రి వర్గంలో చోటు దక్కని నిజామాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఎవరికి అవకాశం దక్కుతుం దనేది చర్చగా మారింది.
నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. అదే జిల్లా నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్, మదన్‌మోహన్‌రావులు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్‌రెడ్డి వైపే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు అధిష్టానం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అదిలాబాద్ జిల్లాలో సీనియర్ నాయకుడు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రేమ్‌సాగర్‌కు మంత్రి పదవి కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
భట్టి విక్రమార్క అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్‌మార్చ్ పేరుతో పాదయాత్ర చేసినప్పుడు ప్రేమ్‌సాగర్‌రావు అన్ని తానై నడిపించారని అప్పట్లోనే వినిపించింది. అదే జిల్లాకు చెందిన వెడ్మ బొజ్జుకు మంత్రి పదవి ఇస్తే.. ఇందిరమ్మ ఇంటిలో నివాసం ఉంటున్న వారికి మంత్రి వర్గంలో చోటు ఇచ్చారనే మంచి సందేశంలో ప్రజల్లోకి వెళ్లుతుందని మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిల మధ్య పోటీ నెలకొన్నది. ఈ ఇద్దరిలో ఎవరికి కేబినెట్‌లో అవ కాశం దక్కుతుందనే చర్చ జరుగుతోంది. మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి.. రామ్మోహన్‌రెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవికి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఎస్టీలోని లంబాడ సామాజికవర్గంలో నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మంత్రివర్గంలో బెర్తు కోసం పోటీ పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు మంత్రులుగా ఉన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో అదే జిల్లా నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చోటు దక్కే అవకాశం ఉండటంతో.. దేవరకొండకు అవకాశం రాకపోవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌కు అదృష్టం కలిసి వస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ నుంచి రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో ఇప్పుడు ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనేది ప్రశ్నగా మారింది.






