15 July, 2026 | 4:46 AM

32 లక్షలకు నీట్ పేపర్

22-06-2024 12:05 AM

కొన్నట్టు  నిందితుల ఒప్పుకోలు

పరీక్షకు ముందే కీతో సహా ప్రిపరేషన్

లీకేజీపై బీహార్‌లో తీవ్రమైన రాజకీయ దుమారం

నిందితులతో దిగిన ఫొటోలు షేర్ చేస్తూ ఆరోపణలు

నితీషే అసలు సూత్రధారి: తేజస్వీ యాదవ్

న్యూఢిల్లీ, జూన్ 21: నీట్ పేపర్ లీకేజీ కేసులో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన బీహార్‌కు చెందిన నలుగురు అభ్యర్థులతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేపర్ లీక్ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్‌కు ఒక్క రోజు ముందు ప్రశ్నాపత్రంతోపాటు సమాధానాల కీ ని సైతం అభ్యర్థులకు అందజేసి పరీక్షకు సిద్ధం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ కేసులో బిహార్ పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో లీకేజీ ముఠా సభ్యులు నితీశ్, అమిత్ ఆనంద్‌తో పాటు నీట్ అభ్యర్థులు అనురాగ్‌యాదవ్, శివానందన్, అభిషేక్, ఆయుష్‌రాజ్, జూనియర్ ఇంజినీర్ సికిందర్ యధువేందు ఉన్నారు. యధువేందు మేనల్లుడు నీట్ అభ్యర్థి అనురాగ్. విచారణలో యధువేందు మమల్ని సంప్రదించి రూ.32 లక్షలు ఇచ్చి ప్రశ్నాపత్రం, కీ ఇచ్చామని నితీశ్, అమిత్ తెలిపారు. వారి నుంచి ప్రశ్నాపత్రం తీసుకున్న యధువేందు ఇతర అభ్యర్థుల ఒక్కొక్కరి వద్ద రూ.40 లక్షలు తీసుకుని ప్రశ్నాపత్రం అమ్మాడని తెలిపారు. 

సీఎం నితీశ్ అసలు సూత్రధారి: తేజస్వీ

మరోవైపు బీహార్‌లో పేపర్ లీకేజీపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అమిత్ ఆనంద్ ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ పీఏకు సన్నిహితుడని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై స్పందిస్తూ బీజేపీ తనను ఇరికించాలని ప్రయత్నిస్తోందని తేజస్వీయాదవ్ మండిపడ్డారు. పేపర్ లీకేజీ కుట్రలో సీఎం నితీశ్‌కుమార్‌కు భాగముందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని తెలిపారు. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని మేం కోరుతున్నాం.

బీజేపీకి అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఈ కేసులో నా పీఏను, నన్ను లాగాలనుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ కేసులో అసలు సూత్రధారులు అమిత్ ఆనంద్, నితీశ్ కుమార్ అని ఆరోపించారు. కాగా, బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరితో అమిత్ ఆనంద్ ఉన్న ఫొటోను ఆర్జేడీ ఎక్స్ వేదికగా తమ అధికారిక ఖాతాలో షేర్ చేశారు. కేసులో ఆనంద్ పేరు బయటకు రాగానే అతడితో ఉన్న ఫొటోలన్నీ సామ్రాట్ తొలగించారని తెలిపారు. అయితే, అవన్నీ తమ వద్ద భద్రంగా ఉన్నాయని, ఇప్పుడు అసలైన దోషులు ఎవరో తెలుస్తుందని ఆర్జేడీ పేర్కొంది.