11 June, 2026 | 1:11 AM

కేసముద్రం స్టేషన్!

11-06-2026 12:26 AM

నత్తనడకన అభివృద్ధి పనులు

కేసముద్రం, జూన్ 10 (విజయక్రాంతి): కొద్దిపాటి చినుకులకే కేసముద్రం రైల్వే స్టేషన్ చెరువుగా మారుతుందని, దీనితో రైలు ఎక్కి దిగడానికి, స్టేషన్లో వేచి ఉండడానికి అసౌకర్యంగా మారిందని రైలు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట డోర్నకల్ రైల్వే సెక్షన్లో కేసముద్రం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

రైల్వే స్టేషన్లో నూతనంగా 2, 3 వ ప్లాట్ ఫామ్ నిర్మాణం, ప్రయాణికుల వసతి సౌకర్యాల కోసం అభివృద్ధి పనులు చేపట్టారు. ప్లాట్ఫామ్ నిర్మాణం పనులు ఏడాదికాలంగా సాగదీస్తున్నారు. ప్రయాణికులు వేచి ఉండే షెడ్ల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ, ప్లాట్ ఫామ్ పై ఇతర వసతి సౌకర్యాల కల్పన పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2వ ప్లాట్ ఫాం రేసింగ్ పనులు ఇప్పటికీ చేపట్టలేదు. 3వ ప్లాట్ఫామ్ పనులు అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి. అలాగే 2,3 ప్లాట్ ఫామ్ లపై ప్రయాణికులకు సరైన తాగునీటి వసతి కల్పించలేదు.

మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించలేదు. రైళ్ల రాకపోకల వివరాలను తెలిపే డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయలేదు. కోచ్ డిస్ప్లే బోర్డులు కూడా అమర్చలేదు. ప్లాట్ఫామ్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో వర్షాకాలంలో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా మారింది. వర్షం నీరు ఎక్కడికక్కడే ప్లాట్ఫామ్ పైనే నిలిచి ఉండడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

మహిళలు, వృద్ధులు, పిల్లలు జారిపడే ప్రమాదం నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయకుండా, కాలయాపన చేస్తున్నారని, దీనితో ప్రయాణికులకు అసౌకర్యంగా కేసముద్రం రైల్వే స్టేషన్ మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు స్పందించి అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వర్షం నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీటి వసతి, 2,3 ప్లాట్ఫారాలపై మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇబ్బందులు తీర్చాలి

కేసముద్రం రైల్వే స్టేషన్లో 2,3 ప్లాట్ ఫారాలపై ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవు. టాయిలెట్ వసతి లేకపోవడం వల్ల మహిళ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. రైళ్ల కోసం నిరీక్షించడానికి ప్రయాణికులు కూర్చోవడానికి అవసరమైన సంఖ్యలో బెంచీలు లేవు. మరమ్మతు పనుల వల్ల రైళ్లలోకి ఎక్కి దిగడం కష్టమవుతుంది. ముఖ్యంగా టాయిలెట్, తాగునీటి వసతి కల్పించాలి. 1వ ప్లాట్ ఫామ్ పై ఏర్పాటు చేసిన విధంగా, 2,3 ప్లాట్ ఫారాలపై ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించాలి.  

- మేరీ వేళాంగిణి, ప్రయాణికురాలు