2 September, 2026 | 1:49 AM

ముంబై కెప్టెన్‌గా తిలక్ వర్మ?

02-09-2026 | 12:01am

రేసులో ముందున్న హైదరాబాదీ 

హార్దిక్ ట్రేడింగ్ లేనట్టే   

ప్లేయర్‌గా కొనసాగనున్న ఆల్ రౌండర్ 

ముంబై, సెప్టెంబర్1: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) గత కొన్ని సీజన్లలో పేలవ ప్రదర్శన కనబరిచింది. హార్షిక్ పాండ్యా సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జట్టు ప్రదర్శన మరింత దిగజారింది. దీంతో వచ్చే సీజన్ కు ముందు ముంబై జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోవడం ఖాయమైంది. దీనిలో భాగంగానే కెప్టెన్ హార్దిక్ పాండ్యాని ట్రేడింగ్ లో మరో జట్టుకు ఇచ్చేస్తున్నట్టు వార్తలు కూడా వినిపించాయి.

అయితే ఈ వార్తలకు ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం చెక్ పెట్టింది. హార్దిక్ ను జట్టులోని కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఈ ఆల్ రౌండర్ ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతాడని సమాచారం. కాగా ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ గా తిలక్ వర్మ(Tilak Varma) పేరు వినిపిస్తోంది. రేసులో ఈ హైదరాబాదీ క్రికెటర్ ముందున్నట్లు సమాచారం.అప్కమింగ్ సీజన్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఫ్రాంచైజీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో ముంబై ఇండియన్స్ ఓనర్స్తో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ మహేళ జయవర్దనే పాల్గొన్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్గా తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా పేర్లను పరిశీలిస్తున్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎంపిక బాధ్యతను రోహిత్ శర్మ తీసుకున్నారని, అందులో భాగంగానే ఆయన సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు తిలక్ వర్మ పేరును యాజమాన్యానికి సూచించినట్లు టాక్ నడుస్తోంది. భవిష్యత్తు అవసరాలను, జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్ కూడా సీనియర్ల కంటే 23 ఏళ్ల యువ సంచలనం తిలక్ వర్మ వైపే ఎక్కువ మొగ్గు చూపుతోంది.

మైదానంలో ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కొంటూ ప్రశాంతంగా ఇన్నింగ్స్ నడిపించే తిలక్ శైలి ముంబై యాజమాన్యాన్ని ఆకట్టుకుంది. గతంలో రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టును, అలాగే ఇండియా-ఏ జట్టును నడిపించిన కెప్టెన్సీ అనుభవం కూడా అతనికి ఉంది.సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై జట్టులోనే కొనసాగేందుకు సుముఖంగా ఉన్నాడని సమాచారం.సూర్యను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ సుముఖంగా లేదని, ఒక సీజన్ వైఫల్యంతో కీలక ఆటగాళ్లను వదులుకోవడం సరికాదని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ మినహా జట్టులో ఎలాంటి మార్పులు లేవని ముంబై ఇండియన్స్ వర్గాలు స్పష్టం చేశాయి.