‘ఎపిక్’లో హంగామా ఉండదు.. హత్తుకునేలా ఉంటుంది!
బ్లాక్‌బస్టర్ ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కథానాయిక వైష్ణవి చైతన్య విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై పంచుకున్న విశేషాలివీ..
పలువురు తెలుగమ్మాయిలు సినీ పరిశ్రమలో వారి ప్రత్యేకతను చాటుతున్నారు. అలాంటి వాళ్లలో ఒక్కదాన్నైన నేను స్టార్డమ్ చూడటం -చాలా సంతోషంగా ఉంది.
కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నా. కథలోనూ, నా పాత్రలోనూ కొత్తదనం ఉండాలి. ఆ పాత్రలో నన్ను నేను చూసుకోగలగాలి. ‘ఎపిక్’ ఎంచుకోవడానికి కారణమదే.
‘ఎపిక్(EPIC)’ సినిమాలో ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర సాఫ్ట్‌గా, కామ్‌గా ఉంటుంది. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆదిత్య ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేను పోషించిన కడలి పాత్ర స్ట్రాంగ్ అమ్మాయి. తన కోసం తాను నిలబడే అమ్మాయి. స్పష్టత ఉన్న అమ్మాయి. ప్రతి ఒక్కరిలోనూ కడలి పాత్ర ఉంటుంది. కానీ, కుటుంబం వల్లనో, సమాజం వల్లనో మనలోని ఆ వెర్షన్ లోపలే ఉండిపోతుంది. బయటకు రాదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో వారి కోసం వారు నిలబడాలి. అందుకే కడలి పాత్ర నా మనసుకు బాగా దగ్గరైంది.
‘బేబీ’ తర్వాత నేను, ఆనంద్ కలిసి నటించిన సినిమా. అయినా ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. కానీ, ఈ మూవీ ఛాలెంజింగ్‌గా చేశాం. ఎందుకంటే ‘బేబీ’, ‘ఎపిక్’ రెండూ దేనికవే ప్రత్యేకం. ‘ఎపిక్’లో మమ్మల్ని చూస్తున్నప్పుడు ‘బేబీ’ గుర్తుకు రాకపోతే మేం విజయం సాధించినట్టే. ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం మాకు మొదటి నుంచీ ఉంది.
సితార సంస్థ రూపొందించిన ‘అల వైకుంఠపురములో’ చెల్లి పాత్ర చేసిన నేను, ఇప్పుడు అదే బ్యానర్‌లో హీరోయిన్‌గా నటించడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇలా జరగడం ప్రతి ఒక్కరూ జీవితంలో పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవచ్చు అనే ఆశను కలిగించింది. ఆ గోల్స్‌ను చేరుకోవచ్చనే నమ్మకం కల్పించింది.
ప్రతి ప్రేమకథలాగే ‘ఎపిక్’లోనూ ప్రత్యేకత ఉంది. భిన్న దారులు, భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు యూకేకు చదువుకోవడానికి వెళ్లి, అక్కడ కలుస్తారు. లివ్ ఇన్‌లో ఉంటారు. ఆ ఇద్దరు ప్రైవేట్‌గా మాట్లాడుకునే సంభాషణల మీద నడిచే సినిమా ఇది. జీవితాన్ని అమ్మాయి ఒకలా, అబ్బాయి ఒకలా చూస్తారు. అసలు వీళ్లెలా కలిశారు? ఇద్దరి ఆలోచనలేంటి? అనేది కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాలో హంగామా ఉండదు. హత్తుకునేలా ఉంటుంది.
నేను ఏదైనా విషయం బయట మాట్లాడాలంటే కాస్త భయపడుతుంటా. కడలి పాత్ర ద్వారా నేనొక విషయం నేర్చుకున్నా. ముందు మనల్ని మనం నమ్మాలి, నమ్మకంగా ఉండాలి. అమ్మాయిలు స్వతంత్రంగా ఉన్న సినిమాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. అయితే, ఒక సముద్రం లాంటి అమ్మాయి తన జీవితంలో ఉన్న సమస్యను ఎదుర్కొంటూ.. తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించిందనేదే ఈ సినిమా ప్రత్యేకత. ఈ పాత్ర ద్వారా మంచి సందేశం కూడా ఉంటుంది.
ఈ సినిమాలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి మాట్లాడతాం కాబట్టి, ‘90స్’ వెబ్ సిరీస్ అంత క్లీన్ ఎంటర్‌టైనర్‌లా ఉండకపోవచ్చు. కానీ, దర్శకుడు ఆదిత్య.. కుటుంబ ప్రేక్షకులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాలో ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. ఇబ్బందికర సన్నివేశాలుండవు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూడొచ్చు.
నా తదుపరి సినిమాల గురించి చెప్పాలంటే.. సితార బ్యానర్‌లో నితిన్‌తో ఒక సినిమా చేస్తున్నా. అలాగే, తమిళ్‌లో రెండు చిత్రాలు, హిందీలో ఒక మూవీ చేస్తున్నా.