8 March, 2026 | 10:18 AM

1.540 కిలోల ఎండు గంజాయి పట్టివేత

08-03-2026 12:00 AM

నిందితుడు రిమాండ్

ఘట్ కేసర్, మార్చి 7 (విజయక్రాంతి): అక్రమంగా విక్రయిస్తున్న 1.540 కిలోల (30 ప్యాకెట్లు) ఎండు గంజాయిని పట్టుకుని నిందితున్ని రిమాండ్ కు తరలించినట్లు ఘట్ కేసర్ ఎక్సైజ్ సీఐ రవీందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం యంనంపేట్ కి చెందిన మొగుళ్ళపల్లి శివ సాయిరెడ్డి (27) ఎండు గంజాయిని అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నాడని అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా శుక్రవారం రాత్రి సుమారు 11:20 గంటలకు రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదుట తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. (TS 08 M 2081) నంబర్ గల మారుతి బలెనో గ్రే కలర్ కారును ఆపి తనిఖీ చేయగా అందులో డ్రైవర్ సీట్ కింద గ్రే కలర్ అమెజాన్ డెలివరీ కవర్ కనిపించింది.

ఆ కవర్ను తెరిచి చూడగా అందులో బ్లాక్ ట్రాన్స్పోర్ట్ కవర్ ఉండగా దానిని తెరిచినప్పుడు ఇంగ్లీష్ న్యూస్పేపర్లలో చుట్టిన చిన్న ప్యాకెట్లు కనిపించాయి.ఆ ప్యాకెట్లను తెరిచినప్పుడు ఘాటు వాసన వచ్చి, అందులో ఆకులు, పూలు, విత్తనాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 30 ప్యాకెట్లు లభించాయి. మొత్తం ఎండు గంజాయి బరువు 1.540 కిలోలు. తదుపరి విచారణలో తాను అమెజాన్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నానని, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కు వెళ్లి అక్కడ అబ్బాసీ అలీ  అబుజర్ అలీ వద్ద నుండి డ్రై గంజా కొనుగోలు చేసినట్లు తెలిపాడు.

అతను తెలిపిన ప్రకారం ఈనెల 2న 2కిలోల డ్రై గంజాను రూ. 30వేలకు కొనుగోలు చేసి బీదర్ నుండి యంనంపేట్ కు తీసుకువచ్చి 4 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లుగా రూ. 400 లకు రాంపల్లి, యంనంపేట్  ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు అంగీకరించాడని తెలిపారు. ఈ విషయమై నిందితుడు మొగులపల్లి శివసాయి రెడ్డి, పరారీలో ఉన్న అబ్బా సీ అలీపై కేసు నమోదు చేశామన్నారు. అలా గే మారుతి బలెనో కారు, వివో మొబైల్ ఫోన్‌ను పంచనామా కింద స్వాధీనం చేసుకొని కేసులో జతపరచడం జరిగిందని అనంతరం నిందితున్ని రిమాండ్‌కు తరలించామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.