17 June, 2026 | 1:21 PM

కేజీబీవీ తిమ్మాజిపేట స్పెషల్ ఆఫీసర్ పై బదిలీ వేటు.!

17-06-2026 12:19 PM

ఆరోపణల నేపథ్యంలో విచారణ పెండింగ్‌లో ఉండగానే కోడేర్‌కు పంపిన విద్యాశాఖ అధికారులు

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) స్పెషల్ ఆఫీసర్ కె. సుజాతపై సిబ్బంది చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆమెను కోడేర్ కేజీబీవీకి డిప్యుటేషన్‌పై పంపుతూ బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఉత్తర్వులు జారీ చేశారు. తిమ్మాజిపేట కేజీబీవీ సిబ్బంది జూన్ 8న చేసిన ఫిర్యాదును ప్రజావాణి ద్వారా జూన్ 15న జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్, సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్) చైర్మన్ ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ కె. సుజాతను కోడేర్ కేజీబీవీకి డిప్యుటేషన్‌పై నియమించారు. వెంటనే కోడేర్‌లో విధుల్లో చేరి, చేరినట్లు నివేదికను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని డీఈఓ ఎ. రమేష్ కుమార్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల ప్రతులను జిల్లా కలెక్టర్, రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌కు కూడా పంపించారు.