15 July, 2026 | 6:07 AM

కియారా.. మరీ అంత పొగరా?

19-06-2024 12:05 AM

సినీ పరిశ్రమలోకి వచ్చి తాజాగా పదేళ్ళు పూర్తి చేసుకుంది బాలీవుడ్ నటి కియారా అద్వానీ. తొలినాళ్ళలో చేసిన ‘ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ మొదలు గతేడాది విడుదలైన ‘సత్యప్రేమ్ కి కథ’ వరకు పలు విజయాలు అందుకుని నటిగా తనదైన గుర్తింపు సొంతం చేసుకుంది ఆమె. ‘భరత్ అను నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల తర్వాత ఐదేళ్ళుగా తెలుగు వారికి ముఖం చాటేసిన కియారా, ‘గేమ్ చేంజర్’ సినిమాతో మరోమారు తెలుగు తెరపైకి రానుంది. ఇటీవల కేన్స్ చిత్రోత్సవాల్లోనూ మెరిసిన కియారా గురించిన ఓ వార్త ప్రస్తుతం అంతర్జాలం చక్కెర్లు కొడుతోంది. ఒక ఎయిర్ హోస్టెస్ కియారా గురించిన ఒక ఘటని ఓ ఇంటర్వూలో వివరిస్తూ ఆమెని పొగరుబోతుగా వర్ణించారు.

ఆ కథనం ప్రకారం.. తాను విధులు నిర్వహిస్తున్న విమానంలో ఓ రోజున కియారా ప్రయాణించగా, విమాన సిబ్బంది స్నాక్స్ అందించేందుకు ఆమెని సంప్రదించబోయారట. అయితే ఆ సిబ్బంది వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని కియారా, అదే సమయంలో తన వ్యక్తిగత సహాయకులని పిలిచి స్నాక్స్ ఇమ్మని అడిగారట. ఈ విషయాన్ని ఆ ఘటన ఎదుర్కొన్న వారే తనతో పంచుకోగా తద్వారా, “కియారాకి మరీ అంత పొగరా..?” అని తాను విస్తుపోయినట్టు తెలిపింది సదరు ఎయిర్ హోస్టెస్. ఇంతకీ ఈ విషయం కియారా చెవిన పడిందంటారా..?