15 July, 2026 | 6:00 AM

నాణ్యత విషయంలో తగ్గేదేలే!

19-06-2024 12:05 AM

‘పుష్ప : ది రూల్’ చిత్రానికి సంబంధించి ఇటీవల వస్తున్న వార్తలకు ముగింపు పలుకుతూ తాజాగా విడుదల తేదీపై స్పష్టతనిచ్చాయి చిత్ర వర్గాలు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ముందుగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన ఉన్న చిత్రీకరణ, తదనంతరం జరగాల్సి ఉన్న నిర్మాణాంతర కార్యక్రమాలని పరిగణనలోకి తీసుకుంటూ సినిమా విడుదలని డిసెంబర్ 6కి మార్చినట్టు తాజాగా వెల్లడించారు.

ఇదివరకు ప్రకటించిన తేదీ లక్ష్యంగానే ప్రస్తుతం చిత్రీకరణ సహా ఇతర కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతు న్నప్పటికీ, ప్రేక్షకులకు నాణ్యతతో కూడిన సినిమా అందించే విషయంలో “తగ్గేదేలే” అన్న మాటకే చిత్ర బృందం అంతా కట్టుబడి ఉన్నట్టు ఈ సందర్భంగా నిర్మాణ వర్గాలు తెలిపాయి. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలకు, పాటలకు వస్తున్న స్పందన దృష్ట్యా ‘పుష్ప: ది రూల్’ చిత్రంతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతి అందించాలన్న సంకల్పంతోనే సినిమా వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకున్నామన్నారు. తొలి భాగమైన ‘పుష్ప : ది రైజ్’ 2021 డిసెంబర్ 17న విడుదలై ఘన విజయం సాధించిన నేపథ్యంలో రెండవ భాగం కూడా డిసెంబరులోనే రానుండటం గమనార్హం.