14-11-2025 09:46:58 PM
జయంతి వేడుకల్లో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్,(విజయక్రాంతి): భారత ప్రజాస్వామ్యానికి, ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన మహానేత మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని నెహ్రూ విగ్రహానికి పార్టీ శ్రేణులు, చిన్నారుల తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో శాస్త్ర విజ్ఞానం, పరిశ్రమల వికాసం, విద్యా రంగ విస్తరణకు నెహ్రూ చూపిన దారి అమూల్యం అని అన్నారు. రైతు, కార్మికుడి అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకుడు నెహ్రూ అని, ఆయన చూపిన అభివృద్ధి మార్గంలో కిసాన్ కాంగ్రెస్ కట్టుబడి ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. నెహ్రూ ఆశయాలను యువత ఆచరణలో పెట్టాలని, దేశ అభివృద్ధికి అందరూ తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ మాజీ సర్పంచ్ గజాన నాయక్, మాజీ కౌన్సిలర్ ముర్తుజా, పట్టణ మాజీ అధ్యక్షుడు వసీం, మన్సూర్ ఖాన్, బషీర్ బాయ్, దత్తు, నవీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.