25 April, 2026 | 2:26 AM

‘జాతిపిత’ అనదగిన కొండా లక్ష్మణ్

25-04-2026 12:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

తెలంగాణ వైతాళికులలో కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖ స్థానం లో ఉంటారు. హైదరాబాద్ విమోచనోద్యమం మొదలుకొని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొనసాగిన మలి ఉద్యమం వరకు కొండా లక్ష్మణ్ నిర్వహించిన క్రియాశీలక పాత్ర సువర్ణాక్షరాలతో లిఖింపదగిన ది. బాపూజీ 97 ఏళ్లు జీవించారు. ఆయన నిజాం రాజ్యం నుంచి ఎదిగిన జాతీయ నాయకులు. కుటుంబ జీవితాన్ని, ఆస్తుల ను, పదవులను, చివరికి రాజకీయ అధికారాన్ని కూడా త్యాగం చేసిన మహా పురుషులు.

తన జీవితంలో ఎవరికీ తలవంచని ధీరుడు, ఆదర్శ నాయకుడు బాపూజీ. విద్యార్థి నాయకుడిగా, బాల్యంలోనే మల్ల యోధుడిగా, ఆదిలాబాద్ జిల్లాలో తొలినాటి విద్యావంతుడిగా, సంఘ సంస్కర్తగా, చేనేతల కష్టనివారకుడిగా, పద్మశాలి సంక్షే మ సంఘం, సహకార సంఘం, హైకో నిర్మాణాల కర్తగా, ఉద్యమకారులకు, పేదలకు ఉచితంగా వాదించే వకీలుగా, నిజాం ఆంధ్ర ఉద్యమం, హైదరాబాద్ స్టేట్ కాం గ్రెస్ ఉద్యమకారుడిగా, గాంధేయవాదిగా, అహింసావాదిగా, క్రమశిక్షణకు, నిక్కచ్చితనానికి, నిర్భయత్వానికి ప్రతీకగా, అచ్చమై న మచ్చలేని రాజకీయ నాయకుడిగా బాపూజీ నిర్వహించిన కార్యక్రమాలు స్ఫూ ర్తిదాయకమైనవి.

ఆ యన శాసనసభ్యుడి గా, వివిధ శాఖల మంత్రిగా, ప్రజాస్వామ్యవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, వెనుకబడిన వర్గాలకు చేయూతనొసగిన నాయకుడిగా, రాష్ట్రం కోసం మంత్రి పదవిని తృణంలా విడిచిపెట్టిన త్యాగశీలిగా, 1994 నుంచి తెలంగాణ ఏర్పాటుకు పెద్ద దిక్కుగా, మానవీయ విలువలు, నైతిక వి లువలు పాటించే మహోన్నత వ్యక్తిగా బా పూజీ కీర్తి గడించారు. తోటి విద్యార్థులకు, ఉద్యమశీలురకు, నాయకులకు, సంస్కర్తల కు ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి బాపూజీ.

విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయ జీవితానికి అలవాటుపడ్డారు. 1935 లో హరిపురాలో సుభాష్ చంద్రబోస్ అ ధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారు. 1938లో పౌరహక్కుల సత్యాగ్రహంలో పాల్గొని, చంచల్ గూడ జైలుపాలయ్యారు. 1941-42 ప్రాంతంలో నిజాం ఆంధ్ర మహాసభలో పాల్గొన్నా రు. 1940లోనే నిజాంకు వ్యతిరేకంగా నిలిచిన వారి పక్షాన కోర్టులో వాదించి గెలిచారు. 1942లో క్విట్ ఇండి యా ఉద్యమంలో పాల్గొన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ నిజాం చీకటి రాజ్యంలో మగ్గడం చూసి ఆయన గుండె భగ్గుమన్నది. ఆ కారణంగానే 1947 డిసెంబర్‌లో 4న నిజాం నవాబు మీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్‌కు తోడుగా ఉన్నారు. అయితే, అజ్ఞాతం లో ఉండి ప్రాణాలు నిలుపుకొన్నారు. లేకపోతే నిజాం ఆయన ప్రాణాలు తీసేవారు.

కొండా లక్ష్మణ్ పద్మశాలి కుటుంబంలో జన్మించారు కనుక చేనేతల దుస్థితికి కంటతడి పెట్టారు. 1943లో హైదరాబాద్‌లో చేనేత సంక్షేమ సంఘం ఏర్పాటుకు నడుం కట్టారు. ఆ సంఘానికి బాపూజీ అధ్యక్షుడు కాగా, బద్దం ఎల్లారెడ్డి కార్యదర్శి. అరమరికలు లేకుండా అన్ని పార్టీల వారికి న్యా యవాదిగా తన సాయం చేసిన ఘనత బా పూజీదే. నాటి ఉద్యమ నాయకులైన రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లతో సన్నిహితంగా ఉండి, రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ దళాలను నిర్మించే ప్రయత్నం చేశారు.

జంట నగరాల్లో పేరొందిన ‘పద్మశాలి హాస్టల్’ భవనానికి బాపూజీ స్థల సేకరణ చేసి, ఆయా గ్రామాల నుంచి నగరానికి వ చ్చే విద్యార్థులకు కల్పతరువుగా నిలిచారు. 1951లో రాష్ట్ర చేనేతకారుల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన టంగుటూరి ప్రకా శం పంతులు.. బాపూజీ ఇంట్లోనే బసచేయడం విశేషం. రామానంద తీర్థతో కలిసి పనిచేయడం బాపూజీకి ఇష్టపాత్రమైంది. తొలి తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డితో కలిసి పనిచేసిన బాపూజీ తర్వాతి కాలంలో తనదైన మార్గంలో నడిచారు.

చెల్లాచెదురుగా ఉన్న బడుగు వర్గాల సంఘాలను ఒక్కతాటి మీదికి తెచ్చారు. 2001లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఏర్పడినప్పుడు రా ష్ట్ర సాధనే ముఖ్యమనే భావనతో, దానికి కేంద్ర కార్యాలయంగా తన ఇంటిని అప్పగించారు. బాపూజీ లేని సమయంలో ఆ ఇల్లును కూల్చివేశారు. కానీ, సుప్రీంకోర్టు ఆ ఇల్లు బాపూజీకి మాత్రమే చెందుతుందని తీర్పు ఇచ్చింది.

సమాజంలో అట్టడుగువర్గాల వారు, అందరితో సమానంగా గౌరవం పొందాలన్న సంకల్పం బాపూజీది. కనుక ఆయన సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడారు. బీసీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఏర్పా టు చేసి స్వయంగా రూ.25 లక్షల మూలధనాన్ని ఇచ్చారు. బాపూజీ 2005లో నా టి భారత రాష్ట్రపతితో ‘ఎమినెంట్ ఫ్రీడం ఫైటర్’గా గౌరవం పొందారు. అఖిల భార త స్థాయిలో పద్మశాలి మహాసభకు మార్గదర్శకుడయ్యారు. సామాజిక న్యాయం సా ధించడానికి అహర్నిశలు పనిచేసిన ఆయనకు ప్రజలే ‘ఆచార్య’ బిరుదు ఇచ్చారు.

ఇందిరాగాంధీ స్వయంగా కొండా లక్ష్మ ణ్ సేవలను, గొప్పతనాన్ని గుర్తించి ‘బాపూజీ’ అని సంబోధించారు. కొండా లక్ష్మ ణ్ జీవితాన్ని, తెలంగాణ చరిత్రను వేరు చూసి చూడలేం. ఆయన జీవితం యావ త్తు తెలంగాణతో ముడిపడింది. తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక వహించిన రాజకీయ నాయకుడిగానే కాక, గొప్ప రా జనీతిజ్ఞునిగా బాపూజీని అందరూ గుర్తుపెట్టుకుంటారు.

భగవంతుడు న్యాయకారి కనుక, కొం దరిని సామాజిక న్యాయం కోసమే పుట్టిస్తాడని బాపూజీని చూసి అర్థం చేసుకో వచ్చు. తాను పుట్టిన పద్మశాలి వంశీయు ల అభ్యున్నతికి ఒకవైపు తోడ్పడుతూనే, సామాజికంగా వెనుకబడిన కులాలకు గౌరవాన్ని కల్గించిన బాపూజీ నిజంగా గొ ప్ప సామాజికవేత్త. ఆయన జీవిత కాలమంతా మంచిని ప్రేమించి, న్యాయం కోసం, రాష్ట్రం కోసం కృషి చేసిన మహా పురుషుడు. తెలంగాణ రాష్ట్రోదయాన్ని కళ్లారాజూడకపోయినా, ‘తెలంగాణ జాతిపిత’గా ఆయనకు చరిత్రలో సముచిత స్థానం కల్పించబడింది.

బాపూజీ విలక్షణమైన వ్యక్తిత్వం ఏమిటంటే, రాజకీయ నాయకులు తమ సంతా నానికి తిరిగి రాజకీయ వారసత్వం ఇవ్వ గా, బాపూజీ తన పుత్రుడైన ఉమేశ్‌ను మి ల్ట్రీలోకి పంపించారు. బాపూజీ సామాన్యులతో ఎలా కలిసిపోయేవారో, మేధావుల తోనూ అట్లాగే కలిసిపోయేవారు. వారి ప్రే మను చూరగొన్న వారిలో నేనూ ఒకణ్ని కావడం నా అదృష్టమే. బాపూజీ ప్రతి రో జు వ్యాయామం చేసేవారు. ఆహార నియ మం పాటించేవారు.

‘ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణమేమిటి?’ అని నేనొకసారి ప్రశ్నించాను. దానికి ఆయన సమా ధానంగా ‘అన్నం తినడానికి ముందు, త ర్వాత నీళ్లు తాగేందుకకు అరగంట వ్యవధి ఉండాల’ని. అదే నా ఆరోగ్యానికి మూల సూత్రమని చెప్పారు. ‘మీరెప్పుడూ నల్ల కళ్లద్దాలే పెట్టుకుంటారెందు కు?’ అని అడిగితే, సమాధానంగా ‘అనవసరమైన దృశ్యా ల మీదికి మన దృష్టి పోకుండా ఉండడానికే’ అన్నారు.

తన జీవితంలో ఎప్పుడూ ఖద్దరు బట్టలే ధరించడానికి కారణం ఏమిటని అడుగగా, ‘మనది ఉష్ణ దేశం. ఖద్దరు బట్టలు చలువనిస్తాయి. పైగా గౌరవాన్ని ఇనుమడింపజేస్తాయి’ అన్నారు. ‘ఇతరుల మీద పై చెయ్యి సాధించడానికి చేయవలసిన పనేమిటి?’ అని అడుగగా ‘ఉన్నది ఉన్నట్లు చెప్పడమే. నిర్భయంగా ఉండటమే’ అని వారిచ్చిన సమాధానం నాకెం తో సంతృప్తిని కల్గించింది.

 వ్యాసకర్త సెల్: 9885654381