ప్రవాస భారతీయులు వెనక్కి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతుండటంతో అమెరికాను వీడుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచీ ఒకవైపు అమెరికా విమానమెక్కే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండగా, మరోవైపు అగ్రరాజ్యం నుంచి స్వదేశానికి తిరుగుపయనమయ్యే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నది. భారతదేశాన్ని నరకకూపంతో పోల్చిన అమెరికా అధ్యక్షుడు ఇండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు.
అమెరికాలోని ప్రవాస భారతీయులు ల్యాప్‌టాప్‌లు కలిగిన గ్యాంగ్‌స్టర్లు అని పేర్కొన్న ఓ పాడ్‌కాస్ట్‌ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. జన్మతః ఇచ్చే పౌరసత్వంపైనా నోటికి పనిచెప్పారు. గతంలోనూ ట్రంప్ భారత్‌పై నోరుపారేసు కోవడం, భారీగా టారిఫ్‌లు విధించిన విషయం విదితమే. ‘అమెరికా గ్రేట్ ఎగైన్’, ‘అమెరికా అమెరికన్ల కోసమే’ అంటూ అగ్రరాజ్యం పగ్గాలందుకున్న ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో ప్రవాస భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి.
అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి వారిని స్వదేశాలకు తరలిస్తున్న దృశ్యాలను చూశాక చట్టబద్ధంగా ఉంటున్నవారూ భయాందోళనకు గురై తిరుగు వలసబాట పడుతున్నారు. ఐటీ కంపెనీల్లో లేఆఫ్‌లు పెరగడం, ఉద్యోగ భద్రత కొరవడటం ఈ ధోరణికి ఆజ్యం పోసింది. ట్రంప్ సర్కార్ హెచ్ వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో అప్లికేషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. 2025 ఆర్థిక సంవ త్సరంలో హెచ్-1బీ వీసాల కోసం 4.7 లక్షల అప్లికేషన్లు రాగా, 2026 ఆర్థిక సంవత్సరంలో 3.4 లక్షల అప్లికేషన్లు మాత్రమే రావడం ఇందుకు నిదర్శనం.
ఇది సుమారు 27 శాతం తక్కువ కావడం గమనార్హం. అంతేకాదు, కంపెనీలు స్పాన్సర్ చేసే వీసా అప్లికేషన్లు సైతం 87 శాతం తగ్గిపోవడం అక్కడి పరిస్థితిని సూచిస్తున్నది. ట్రంప్ విధానాలు, ఆయన నినాదాల మూలంగా ఐటీ కంపెనీలు విదేశీయుల నియామకాలను దా దాపుగా నిలిపివేశాయనే చెప్పాలి. సాధారణంగానే ప్రవాసీయులు గ్రీన్‌కార్డుల కోసం 10-20 ఏళ్లు వేచిచూడాల్సి ఉంటుంది.
నిబంధనలు కఠి నంగా మారడంతో ఆ అప్లికేషన్లకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో చెప్పలేని పరిస్థితి. ట్రంప్ ఆర్భాటంగా ప్రకటించిన గోల్డెన్ వీసాను (1 మిలియన్ డాలర్ల పెట్టుబడి) ఇప్పటివరకు ఒక్కరికే ఇవ్వడం పరిస్థితికి అద్దం పడుతున్నది. పొమ్మనలేక పొగబెట్టే పరిస్థితులు కల్పిస్తుండటంతో ప్రవాస భారతీయులు అమెరికాను వీడుతున్నారని చెప్పవచ్చు.






