18 March, 2026 | 3:04 AM

మంత్రి తుమ్మలతో కొత్తగూడెం కలెక్టర్ భేటీ

18-03-2026 12:01 AM
  1. కలెక్టర్‌కు మంత్రి తుమ్మలకీలక ఆదేశాలు 

నవమికి భద్రాచలంకు సీఎం రేవంత్ రాక 

సీఎం చేతుల మీదుగా భద్రాద్రి ఆలయ పనులకు శంకుస్థాపన

భక్తుల సేవలో ప్రభుత్వం నినాదంతో సేవలు

ఉగాది నాటికి కొత్తగూడెం   భద్రాద్రి ఆధునీకరణ పనులు పూర్తి చేయాలి 

భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశం 

సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయాలి 

యాతాలకుంట టన్నెల్ పనులు వేగవంతం 

50,000 ఎకరాలు సాగులోకి తీసుకురావాలి 

పాండురంగాపురం మల్కానగిరి రైల్వే లైన్ మంజూరు 

ఫస్ట్ పేజీలో సారపాక వరకు భూ సేకరణ    పూర్తి చేయాలి 

రైల్వే లైన్‌తో భద్రాద్రి పర్యాటకం, బిపిఎల్ వాటర్ ప్లాంట్లకు ప్రయోజనం 

భద్రాచలం జిల్లాలో ఎయిర్పోర్ట్ కు అనుకూల భూమి గుర్తించండి

కొత్తగూడెం భువనగిరి రహదారిలో భద్రాద్రి పెండింగ్ పనులు పూర్తి చేయాలి 

ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వ సబ్సిడీ 

రైతులకు అవగాహన కల్పించాలి 

భద్రాద్రి అభివృద్ధిపై మంత్రి తుమ్మల ఫోకస్ 

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 17, (విజయక్రాంతి): జిల్లా సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ భేటీ అయి, జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. భద్రాద్రి జిల్లా సమగ్ర అభివృద్ధికి మంత్రి తుమ్మల కీలక దిశానిర్దేశం చేశారు.

మంత్రితో జిల్లా కలెక్టర్ భేటీలో పలు కీలక భద్రాద్రి రామాలయ అభివృద్ధి పనుల పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సాగునీటి పనులు, భూసేకరణ, రైల్వే లైన్ పనులు, పర్యాటక అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

నవమి సందర్భంగా సీఎం రేవంత్ రాక..

శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు రానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. భద్రతా ఏర్పాట్లు, రవాణా, భక్తులకు సౌకర్యాలు, వసతి తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తుగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల సేవలో ప్రభుత్వం అనే నినాదంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. సకల సౌకర్యాలతో కళ్యాణం వీక్షించేలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. 

తొలి విడతలో రూ.100 కోట్లతో భద్రాద్రి ఆలయ  పనులకు శంకుస్థాపన..

భద్రాచలం ఆలయ అభివృద్ధిలో భాగంగా 300 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తొలి విడతలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భద్రాద్రి ప్రాకారం నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు డివైడర్లు ,సెంటర్ లైటింగ్, పూల మొక్కలు సుందరీకరణ పనులు ఉగాది నాటికి పూర్తి చేసేలా ముమ్మరంగా  చేపట్టాలన్నారు. 

సీతారామ డిస్ట్రిబ్యూటరీ భూసేకరణ త్వరితగతిన పూర్తి..

జిల్లాలో సాగునీటి విస్తరణకు కీలకమైన సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. భూసేకరణ పూర్తయితే ప్రాజెక్టు పనులు వేగవంతమై రైతులకు త్వరగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో యాతాలకుంట టన్నెల్లో మిగిలిన సుమారు 100 మీటర్ల పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 50 వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

పాండురంగాపురంమల్కాన్ గిరి రైల్వే లైన్కు ప్రాధాన్యం..

భద్రాద్రి అభివృద్ధికి కీలకమైన పాండురంగాపురం మల్కానగిరి రైల్వే లైన్కు అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో సారపాక వరకు భూ సేకరణ  పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

పర్యాటకాభివృద్ధికి రైల్వే లైన్ కీలకం..

ఈ రైల్వే లైన్ పూర్తయితే దక్షణ అయోధ్యగా ఉన్న భద్రాద్రి ప్రాంతంలో సాంస్కృతిక శోభ వెల్లి విరుస్తుందని, పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తుందని మంత్రి తెలిపారు. అలాగే జిల్లాలో కీలకంగా ఉన్న   బిపిఎల్ , హెవీ వాటర్ ప్లాంట్ల, కు కూడా రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ త్వరితగతిని పూర్తిచేసేలా చూడాలన్నారు.

భద్రాచలం జిల్లాలో ఎయిర్పోర్ట్కు అనుకూల భూమి గుర్తింపు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు చోట్ల విమానాశ్రయాలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని అక్కడ ఏర్పోర్ట్ అథారిటీ ఆప్రాంతాలను తిరస్కరించిందని, భద్రాచలం, కొత్తగూడెం, మధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలమైన భూమిని గుర్తించాలని మంత్రి కలెక్టర్ను ఆదేశించారు. దీనిపై సంబంధిత శాఖలు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.

కొత్తగూడెం భువనగిరి రహదారిలో పెండింగ్ పనులు పూర్తి..

కొత్తగూడెంభువనగిరి రహదారి పరిధిలో భద్రాద్రి జిల్లాలో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ రహదారి అభివృద్ధి వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడి వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయని తెలిపారు.

ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన..

రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆయిల్ పామ్ సాగుకు అందిస్తున్న సబ్సిడీలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఈ కీలక ప్రాజెక్టుల అమలుపై అధికారులతో  నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు