18 March, 2026 | 1:36 AM

కష్టాల కడలిలో.. ట్రాక్టర్ యజమానులు

18-03-2026 12:00 AM

పనులు లేక నిలిచిన వాహనాలు పెరుగుతున్న ఫైనాన్స్ కిస్తీలు, ఆందోళనలో కుటుంబాలు

అశ్వాపురం, మార్చి 17 (విజయక్రాంతి): జీవనాధారం కోసం అప్పులు చేసి ట్రాక్టర్లు కొనుగోలు చేసిన అనేక మంది యజమానుల పరిస్థితి అశ్వాపురం మండలంలో రోజురోజుకు కష్టాల్లోకి జారుతోంది. కుటుంబాలకు ఆదాయం వస్తుందనే ఆశతో ఫైనాన్స్ కంపెనీల నుంచి అప్పులు తీసుకుని ట్రాక్టర్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు పనులు లేక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. చింతిర్యాల, గొల్లగూడెం, చింతిర్యాల కాలనీ, ఆనందపురం, సీతారామపురం పంచాయతీల పరిసర ప్రాంతాల్లోని ట్రాక్టర్లు గత కొన్ని నెలలుగా సరైన తోలకాలు లేక ఇండ్ల వద్దే నిలిచిపోయాయి.

చేతిలో పని లేకపోవడంతో ఫైనాన్స్ కిస్తీలు చెల్లించడం యజమానులకు భారంగా మారింది. కొంతమంది ఎలాగోలా అప్పులు చేసి కిస్తీలు కడుతుండగా, మరికొందరు కుటుంబ పోషణ కూడా కష్టమై ట్రాక్టర్లను ఫైనాన్స్ సంస్థలకు అప్పగించాల్సిన పరిస్థితికి చేరుకుంటున్నారు. జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన వాహనాలే ఇప్పుడు వారి భుజాలపై భారంగా మారుతున్నాయని ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని కొన్ని పంచాయతీలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని కొందరు సాధారణ ట్రాక్టర్ యజమానులు గోదావరి నుంచి సహజంగా ఏర్పడిన ఇసుకను మండల ప్రజల అవసరాలకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారు ఈ పని చేసేది కోట్లు సంపాదించేందుకు కాదు. కేవలం కుటుంబాలను పోషించుకునేందుకు మాత్రమే ఈ వృత్తిని కొనసాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు.

ఈ ప్రాంతాల్లో ట్రాక్టర్లు నడిపే వారి జీవన పరిస్థితులను పరిశీలిస్తే వారి ఆర్థిక స్థితి ఎంత కష్టాల్లో ఉందో స్పష్టమవుతుంది. గోదావరి నుంచి అరకొర ఇసుకను తోలుకుంటూ జీవనం సాగిస్తున్న కొందరికి కనీసం నివసించేందుకు సరైన ఇల్లు కూడా లేకపోవడం స్థానికులు చెబుతున్న వాస్తవం. సమాజంలో ఎవరికీ భారంగా కాకుండా స్వయంగా కష్టపడి జీవించాలనే ఉద్దేశంతోనే ఈ ట్రాక్టర్ యజమానులు తమ వాహనాలను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే కొన్ని శాఖల అధికారులు వారి పరిస్థితిని గమనించి సహకరించాలని భావించినప్పటికీ, సామాజిక మాధ్యమాలు మరియు సోషల్ మీడియా ప్రభావంతో ప్రతి చర్యపై విమర్శలు రావడంతో అధికారులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రాక్టర్ యజమానుల జీవన స్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్రంగా పరిస్థితిని పరిశీలించి వారికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటే అనేక కుటుంబాలకు ఊరట లభించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

స్థానిక ట్రాక్టర్ యజమాని వెన్న అశోక్ కుమార్ మాటల్లో.. పొట్ట నింపుకోవడానికే కొనుకున్న ట్రాక్టర్& ఇప్పుడు అదే జీవన భారంగా మారింది. అశ్వాపురం మండలంలో చింతిర్యాల గోదావరి నది ఒడ్డు నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా జరుగుతోంది. కానీ మరికొన్ని పంచాయతీలలో గోదావరి ఒడ్డు నుంచి లారీల ద్వారా అక్రమంగా ఇతర ప్రాంతాలకు ఇసుక తరలింపులు జరుగుతున్నాయి.

అయినా అధికారులు మాత్రం చింతిర్యాల గోదావరి వెళ్లే దారిలోనే తరచూ ట్రెంచ్లు కొడుతున్నారు. దీంతో ప్రజల్లో పలు అపోహలు కూడా వ్యక్తమవుతున్నాయి. గోదావరి ఇసుకతో జీవనం& కానీ లాభం మాత్రం లేదు.