క్రాంతి మార్పు కోసం పనిచేశారు.
ములకలపల్లి,(విజయక్రాంతి): సమాజంలో మార్పు కోసం క్రాంతి పని చేశారని పలువురు వక్తలు కొనియాడారు. మావోయిస్టుగా పనిచేసి తర్వాత కాలంలో జర్నలిస్ట్ గా పనిచేస్తూ మార్చి 30వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన పోతుగంటి బ్రహ్మం (@ క్రాంతి) సంతాపసభను ఆయన స్వగ్రామమైన ములకలపల్లి మండలంలోని తిమ్మంపేట నిర్వహించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు క్రాంతి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన సంతాప సభలో పలువురు మాట్లాడారు. క్రాంతి ధైర్యవంతుడని నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అని మావోయిస్టుగా పనిచేసి పోలీసు అరెస్టు తర్వాత జర్నలిస్టుగా తన ప్రయాణాన్ని ప్రారంభించి పాత్రికేయ వృత్తికి న్యాయం చేశారని ఆయన సేవలను కొనియాడారు.అనేక సమస్యలను ప్రభుత్వం,అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి పనిచేశారన్నారు. తిమ్మంపేట సర్పంచ్ తుర్రం శ్రీనివాసరావు,సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కోర్సా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




