సీఎం రేవంత్‌కు దమ్ముంటే.. “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ముంటే చలో ఢిల్లీ కాదు.. చలో పల్లె చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ కాక లక్షలాది మంది రైతులు రగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వైపు కన్నత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎనిమిది నెలల్లో ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా?.. రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా?, ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారు.. గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారు.. మీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటి..?, అన్నదాతలను ఆగంచేసి.. దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. రైతుల తండ్లాట తీర్చేదెవరు.. రుణమాఫీ పూర్తిచేసెదెవరు..?, అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప… అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా..? అని కేటీఆర్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
రైతులకేమో మాయమాటలు.. ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?, 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది.. “గుండుసున్నా” అన్నారు. ఓవైపు డెంగీ మరణాలు.. మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు పెరిగిపోయని తెలిపారు. గాడితప్పిన పాలనతో.. రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది.. ఢిల్లీలో కాదు.. తెలంగాణ గల్లీల్లో అన్నారు. రాష్ట్రాన్ని గాలికొదిలేసి అన్నదాతలను అరిగోస పెట్టి.. హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే.. తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యమని కేటీఆర్ హెచ్చరించారు.






