ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్య
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Huzurabad MLA Padi Kaushik Reddy) అరెస్ట్ దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రుల అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ రెడ్డిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్ర అనేక నెలల నుంచి కొనసాగుతూనే ఉందని తెలిపారు. ఇలాంటి చిల్లర చేష్టలు, పనికిరాని కేసులు, బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవని పేర్కొన్నారు.
ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకునే రేవంత్ ఎమర్జెన్సీని తలపించేలా ప్రశ్నించే గొంతులపై అణచివేత చర్యలతో ప్రజాక్షేత్రంలో అబాసపాలవుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకే దారుణాలు చేస్తున్నారని విమర్శించారు. మా నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి కోర్టుల్లో నిలబడే అవకాశం లేదని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బేషరుతుగా వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని(Padi Kaushik Reddy) పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించాడని అతని భార్య ఫిర్యాదు చేసింది. రూ.50లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సుబేదారి పోలీసులు కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.






