కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్
- కాంగ్రెస్ పార్టీ.. జిత్తులమారి నక్క.
- రాహుల్ కు మన భాష రాదు.. మన బాధ తెల్వదు.
- జాబ్ క్యాలెండర్ కు నైనై.. స్కామ్ క్యాలెండర్ కు సైసై.
- కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్..
- 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.
- శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా-
సరూర్‌నగర్: యువత డిక్లరేషన్ పేరుతో బురిడి పత్రం విడుదల చేశారని సరూర్ నగర్ లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో(Yuva Sangrama Sadassu) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వేలమంది విద్యార్థులను చంపిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదిలిపోతాయని చెప్పారు. జిత్తులమారి నక్క లాంటి కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. జంగ్ సైరన్ మోగించడానికి యువతరం కదిలివచ్చిందన్నారు. యువ గళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయని సూచించారు. కాంగ్రెస్ పార్టీ.. జిత్తులమారి నక్క అన్నారు. యువతరంతో పెట్టుకుంటే తరాలపాటు పుట్టగతులు లేకుండా పోతాయని హెచ్చరించారు.
యూత్ డిక్లరేషన్ పేరిట మోసం చేసిన కాంగ్రెస్ నేతలకు డెత్ డిక్లరేషన్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, రేవంత్ రెడ్డికి డెత్ డిక్లరేషన్ రాయాలని యువతకు సూచించారు. ''రాహుల్ కు మన భాషరాదు.. మన బాధ తెల్వదు. యూత్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?, తెలంగాణలో నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్లే.. యువతకు జాబులు లేవు.. రాహుల్ గాంధీ జేబులే నిండుతున్నాయి.? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేదాకా విశ్రమించనని రేవంత్ రెడ్డి అంటున్నారు.
రేవంత్ కు పదవి ఇచ్చింది యువతకు జాబులు ఇచ్చేందుకా.. రాహుల్ గాంధీకు జాబ్ ఇచ్చేందుకా? అని ప్రశ్నించారు. తెలుగు, ఇంగ్లీష్ క్యాలెండర్లు మారాయి..జాబ్ క్యాలెండర్ మాత్రం మారట్లేదన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ను చిత్తు కాగితంతో సమానం చేశారని విమర్శించారు. అన్నదమ్ముల అల్మారాలు నింపుతున్నారు.. బినామీలు బీరువాలు నింపుతున్నారు. జాబ్ క్యాలెండర్ కు నైనై.. స్కామ్ క్యాలెండర్ కు సైసై అన్నారు. రక్తపిశాచి కాంగ్రెస్ రక్తదాహం తీరలేదని ఫైర్ అయ్యారు. మన రక్తం పొలాల్లో చల్లుతానని రేవంత్ రెడ్డి అంటున్నారన్న కేటీఆర్ 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాహుల్ గాంధీకి జై కొడతా అన్నారు. నోటిఫికేషన్లతో సహా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.
పోలీసు ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావమంటారా? గతంలో ఓటుకు నోటు.. ఇప్పుడు ఓటేసినోడికి పోటు.. కాంగ్రెస్ కు గోరీ కడతామని యువత ఒట్టు పెట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుందన్నారు. 95 శాతం స్థానిక రిజర్వేషన్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలిసో తెలియకో కొనని పొరపాట్లు బీఆర్ఎస్ పాలనలో జరిగాయని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో టీజీపీఎస్సీ పేపర్లు లీకైతే మన పోలీసులే పట్టుకున్నారని తెలిపారు. పేపర్ లీకేజీల సమయంలో కమిషన్ పై చర్యలు తీసుకోవాల్సిఉండే అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చామన్నారు. బీఆర్ఎస్ పాలనలో 24 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. నేనే రాజు నేనే మంత్రి నేనే హిట్లర్ అంటూ రేవంత్ బట్లర్ మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ రాకెట్ ప్రయోగించిన స్కైరూట్ టీహబ్ లోనే పురుడుపోసుకుందని చెప్పారు. కేసీఆర్ తెచ్చిన కంపెనీలకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ వేసిన ఫ్లైఓవర్లకు రేవంత్ రెడ్డి రంగులు వేస్తున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీ పేరుతో 10 వేల ఎకరాలు అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ కంపెనీలను గుజరాత్ కు గద్దల్లా తన్నుకుపోయారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






