12 April, 2026 | 7:22 PM

రాష్ట్రంలో “దోచుకో-దాచుకో” అనే పథకం నడుస్తుంది

12-04-2026 06:12 PM

హైదరాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతన పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మాంచారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి 'దాచుకో-దోచుకో' అన్న పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా నడిపిస్తున్నారు. అవినీతి దుకాణం తెరిచి అడ్డగోలుగా వసూళ్లకు దిగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి పథకంలో స్వయంగా మంత్రుల నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడుతున్నారు.

ముఖ్యమంత్రి ప్రారంభించిన  'దాచుకో-దోచుకో-దాచుకో' పథకం సింగరేణిలోనూ నడుస్తోంది. రేవంత్ రెడ్డి అంత చండాలపు ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరూ లేరు. రేవంత్ రెడ్డి అంత దారుణంగా, భారీ ఎత్తున దోచుకుంటున్న ముఖ్యమంత్రి కూడా దేశంలో ఇంకా ఎవరూ లేరు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అంటే, తెలంగాణ రైతుల ముఖంలో చిరునవ్వులు రావాలి అంటే, సింగరేణి కార్మికులకు లాభం జరగాలి అంటే కేసీఆర్ తిరిగి రావాల్సిందే. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే కేసీఆర్ తిరిగి రావాల్సిందే.

కాంగ్రెస్ పార్టీతో బిజేపి కూడా వంత పాడుతూ సింగరేణి కుంభకోణాన్ని అడ్డుకోవడం లేదు. వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నా 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం కనీసం ఉలుకూ పలుకూ లేకుండా మౌనంగా ఉన్నది. వేల కోట్ల దోపిడీ పైన సీబీఐ ఎంక్వైరీ వేయమంటే పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్, బిజేపి చీకటి దోస్తులుగా మారి ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి బావమరిది సింగరేణిలో టెండర్లు వేస్తుంటే ఇక్కడే వసూళ్లు అవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ పథకంలో కూడా సృజన్ రెడ్డికి వందల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చింది. అందుకే రాష్ట్రంలో ఇచ్చిపుచ్చుకునే విధంగా బిజేపి, కాంగ్రెస్ లు కలిసి నడుస్తున్నాయి. అందుకోసమే ఒకరి దోపిడీ ఒకరు బయటపడకుండా బ్రహ్మాండంగా కాంగ్రెస్, బిజేపి పార్టీలు పరస్పరం కాపాడుకుంటున్నాయి.