calender_icon.png 26 November, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

38 ఏళ్లుగా అజ్ఞాతంలోనే కేవీ!

26-11-2025 12:00:00 AM

  1. బతికున్నాడనే ఆశ వదిలేసుకున్న తల్లిదండ్రులు
  2. బతికుండి, జనజీవన స్రవంతిలో కలిస్తే సంతోషిస్తామంటున్న వృద్ధ దంపతులు
  3. లొంగిపోవాలంటూ పోలీసుల ప్రకటన

మహబూబాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన కర్ర వెంకట్‌రెడ్డి (కేవీ) మావోయిస్టు పార్టీలో ఆంధ్ర ఒడి శా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన కర్ర సోమిరెడ్డి, సరోజన దంపతులకు వెంకట్‌రెడ్డితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమిరెడ్డి గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్‌గా విధుల్లో చేరి ఈవోగా కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ చేసి, కేసముద్రంలో నివాసం ఉంటున్నారు.

సోమి రెడ్డి దంపతులకు 1968 నవంబర్ 14న జన్మించిన వెంకట్‌రెడ్డి.. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత 1988 జనవరి 1న కనిపించకుండా పోయాడు. అదృశ్యమైన కుమారుడి ఆచూకీ కోసం సోమిరెడ్డి చాలాకాలం వెతికినా ఫలితం లేకుండా పోయింది. కొన్నేళ్ల తర్వాత తమ కుమారుడు పీపుల్స్ వార్ పార్టీలో చేరి అజ్ఞాతవాసం అనుభవిస్తున్నట్లు పోలీసుల ద్వారా సమాచారం అందుకున్నారు.

పీపుల్స్ వార్‌పై ప్రభుత్వ నిర్బంధ సమయంలో సోమిరెడ్డి దంపతులను కూడా పోలీసులు వెంకట్‌రెడ్డి ఆచూకీ కోసం చాలాసార్లు ఒత్తిడి చేశారు. అయినా వెంకట్‌రెడ్డి ఆచూకీ లభించకుండా పోయింది. కొంతకాలం పాటు కొడుకు కోసం నిరీక్షించిన తల్లిదండ్రులు చివరకు తమ కొడుకు బతికున్నాడనే ఆశ  వదిలేసుకున్నట్లు సోమిరెడ్డి దంపతులు విజయక్రాంతి ప్రతి నిధికి తెలిపారు.

తమ కుమారుడు మావోయి స్టు పార్టీలో అగ్రనేతగా పనిచేస్తున్నాడని పోలీసులు అప్పుడప్పుడు చెప్పడమే తప్ప, ఇప్పటివరకు తమ కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడదన్నది స్పష్టమైన సమాచారం లేదని చెప్పారు. 38 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుడు పీపుల్స్ వార్ పార్టీలో పనిచేస్తున్నట్లు పోలీసులు చెపుతున్నప్పటికీ, ఇప్పటివరకు అతడు ఎక్కడ కూడా ఎలాంటి విధ్వంసకర సంఘటనలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించినట్లు తమ దృష్టికి రాలేదన్నారు.

ఇటీవల మావోయిస్టు పార్టీ నేతలు ప్రభు త్వ నిర్బంధంతో లొంగుబాట పట్టిన నేపథ్యంలో తమ కుమారుడు కూడా బతికి ఉన్నట్లయితే జనజీవన స్రవంతిలో కలిసి ఇంటికి తిరిగి వస్తే సంతోషిస్తామని ఆ వృద్ధ దంపతులు  ఆశాభావం వ్యక్తం చేశారు.

38 ఏళ్లుగా ఉద్యమంలోనే! 

20ఏళ్ల వయసులో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన కర్ర వెంకట్‌రెడ్డి ప్రస్తుత వయసు 58 సంవత్సరాలు. వెంకట్‌రెడ్డి 38 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉంటూ మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నాడని పోలీసులు ప్రకటిస్తున్నారు. దళ సభ్యుడిగా పీపుల్స్ వార్‌లో చేరిన వెంకట్‌రెడ్డి మావోయిస్టు పార్టీలో ఆంధ్ర ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో పనిచేస్తున్నట్లు పోలీసువర్గాలు ప్రకటించాయి.

ప్రస్తుతం ఆయన స్టేట్ కమిటీ మెంబర్‌గా కీలకమైన బాధ్యతల్లో ఉన్నట్లు సమాచారం. ఆదివారం రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట కీలకమైన నక్సలైట్లు లొంగిపోయిన నేపథ్యంలో ఇంకా ఉద్యమంలో కొనసాగుతున్న కర్ర వెంకట్‌రెడ్డితో పాటు మరో పదిమంది కీలక నేతలు లొంగిపోవాలని ప్రకటన చేయడంతో మళ్లీ వార్తల్లో కేవీ పేరు వినిపించింది.