26-11-2025 12:37:47 AM
-చందానగర్ సర్కిల్‌లో శ్లాబులు కూల్చేసిన అధికారులు
-జాతీయ రహదారి వెనుక సాగుతున్న భవన నిర్మాణ పనులు
శేరిలింగంపల్లి, నవంబర్ 25 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ చందానగర్ సర్కిల్ పరిధిలో జరుగుతున్న అనుమతి లేని నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ అధికారులు కన్నెర్ర చేశారు. ‘అక్రమ నిర్మాణం అండ్ అందిన కాడికి దోచేయ్ అంటూ ఈనెల 7న విజయక్రాంతిలో ప్రచురితమైన కథనానికి అధికారు లు స్పందించారు. చందా నగర్ సర్కిల్ పరిధిలో జరుగుతున్న అనుమతిలేని నిర్మాణం పై టౌన్ ప్లానింగ్ విభాగం దృష్టి సారించింది.
సర్కిల్‌కు అతి సమీపం లో, జాతీయ రహదారి వెనక అనుమతి లేకుండా సాగుతున్న భవన నిర్మాణ పనులపై విభాగం మంగళవారం చర్యలు ప్రారంభించింది. ఏసీపీ నాగిరెడ్డి, సెక్షన్ అధికారి రమేష్ బృం దంతో కలిసి అకస్మాత్తుగా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భవనంపై అనుమతులకు మించి విస్తరించే పనులు జరుగుతున్నట్టు అధికారులు కనుగొన్నారు. అనుమతి దాటి అదనపు అంతస్తులు వేస్తున్నట్టు తేలడంతో అక్కడికక్కడే కూల్చివేత చేపట్టారు.
బృందం పర్యవేక్షణలో భవనంపై వేసిన అదనపు స్లాబులను కూల్చడంతో పను లు పూర్తిగా ఆగిపోయాయి. జాతీయ రహదారి వెనక నెలలుగా ఈ నిర్మాణంపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పత్రిక కథనం వెలువడిన తర్వాతే చర్యలు మొదలైనట్టు ప్రజలు పేర్కొంటున్నారు. అక్రమంగా భవనాలు పెంచే వారికి ఇది స్పష్టమై న హెచ్చరికగా మారింది.చందానగర్ సర్కిల్ పరిధిలో మరికొన్ని అనుమానాస్పద నిర్మాణాలపై కూడా విభాగం పర్యవేక్షణను పెంచినట్టు సమాచారం.