14 March, 2026 | 1:12 AM

పల్లె వెలుగు బస్సుల జాడేదీ?

14-03-2026 12:00 AM

మారుమూల గ్రామాలకు బస్సులు లేక ప్రజలు, విద్యార్థుల అవస్థలు

బోడంగిపర్తి పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు వేడుకోలు

చండూరు, మార్చి 13: ప్రయాణానికి ఎక్కడ ఇబ్బందులు ఉండొద్దన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం పల్లె వెలుగు పేరుతో ఆర్టీసీ బస్సులను పల్లెలకు సైతం పంపింది. కానీ అవి ఇప్పుడు చాలా పల్లెల్లో కనిపించడం లేదు. కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం కావడంతో పల్లెల్లో రవాణా అస్తవ్యస్తంగా మారిందని విద్యార్థులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలోని పలు గ్రామాలకు బస్సులు రాకపోవడంతో ఆయా గ్రామాలకు చెందిన వారు ప్రయాణానికి అవస్థలు పడుతున్నారు. 

విద్యార్థులకు తప్పని తిప్పలు

గతంలో నేర్మట నుండి బోడంగిపర్తి గ్రామానికి కరోనా సమయంలో ఆర్టీసీ అధికారులు విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించారు. కానీ నేడు  బోడంగిపర్తి గ్రామానికి బస్సు సౌకర్యం లేక ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మండలలోని నేర్మట నుండి 50, బంగారుగడ్డ 50, ధోని పాముల 50, ఇతర గ్రామాల నుండి ఎంతోమంది విద్యార్థులు బోడంగిపర్తి పాఠశాలకు  ఆటోలలో బిక్కుబిక్కు మంటూ ప్రయాణిస్తారు.

అంతేకాకుండా చండూరు హై స్కూల్ కు  వందలాది మంది విద్యార్థులు  ఇతర మారుమూల గ్రామాల నుండి ఆటోలలో ప్రయాణించడం పరిపాటిగా మారిపోయింది. మారుమూల గ్రామాలైన నేర్మట, తిమ్మారెడ్డి గూడెం, చామలపల్లి, తాస్కాని గూడెం, శిర్దపల్లి, జోగిగూడెం, కస్తాల ఈ గ్రామాల నుండి నల్లగొండలో వందల మంది విద్యార్థులు చదువుకుంటారు. కానీ ఈ గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడం వలన కాలేజీకి విద్యార్థులు ఆలస్యంగా వెళుతున్నారు..

మాల్ నుండి నేర్మటకు ఉదయం ఏడు గంటలకు ఆ గ్రామానికి వచ్చి వయా ధోని పాముల, చండూరు నుండి నల్లగొండకు బస్సు సౌకర్యం కల్పించారు. కానీ అదే బస్సు మళ్లీ సాయంత్రం  నేర్మట కు రాకుండా మాల్ కు వెళ్లిపోతుంది. కానీ ఆ బస్సును  సాయంత్రం నేర్మటకు వచ్చే విధంగా  అధికారులు చొరవ చూపాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

రోడ్డు ఉన్న బస్సులు రాని ఊర్లెన్నో... 

మండల పరిధిలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యమున్న బస్సు వసతి లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రయాణానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ముఖ్యంగా బోడంగిపర్తి పాఠశాలకు ఎన్నో ఏళ్ల నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు ఆటోలలోనే ప్రయాణించడం ప్రజా ప్రతినిధులకు, అధికారులకు తెలిసినా కూడా ఇప్పటివరకు కూడా ఆ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించకపోవడం గమనార్హం.

  అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కల్పించగా మండలంలోని పలు గ్రామాల మహిళలకు అందరి ద్రాక్షగా మారిందని ఆయా గ్రామాల మహిళలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. బోడంగిపర్తి పాఠశాలకు చుట్టుపక్కల గ్రామాలైన చోల్లెడు, బంగారిగడ్డ, ఇడికూడ, తాస్కానిగూడెం, శిర్దపల్లి, నేర్మట, తిమ్మారెడ్డిగూడెం, పుల్లెంల, కొండాపురం, కమ్మగూడెం గ్రామాలే కాక వేరే మండలం నుండి  వందల మంది విద్యార్థులు  ఈ పాఠశాలలోనే చదువుకుంటారు.

గతంలో నేర్మట నుండి బోడంగి పర్తి పాఠశాలకు పోయే విద్యార్థులు ఆటోలలో ప్రయాణించడం వలన ప్రమాదం తృటిలో తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నోసార్లు ఆర్టీసీ అధికారులకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరిన పట్టించుకోవలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు బోడంగిపర్తి పాఠశాలకు, నల్లగొండకు ఉదయం సమయాన, సాయంత్రం సమయాన విద్యార్థులకు వీలు ఉండే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని, అదే విధంగా మారుమూల గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు వచ్చే విధంగా రవాణా సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు.

విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి

మారుమూల గ్రామాల నుండి బోడంగిపర్తి పాఠశాలకు, మరోవైపు నల్లగొండకు నిత్యం ఎంతోమంది విద్యార్థులు పాఠశాల, కళాశాలకు వెళుతుంటారు. వారు బస్సు సౌకర్యం సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వెళ్లే విద్యార్థులు పాఠశాలలకు పోవాలంటే ఆటోలలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. కావున ప్రభుత్వ స్పందించి విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలి.

 ఈరటి వెంకటయ్య, నేర్మట గ్రామస్తుడు