10 వేలకు నెట్ ప్రశ్నాపత్రం
రూ.5 నుంచి 10 వేలకు విక్రయం
డార్క్‌వెబ్ నుంచి గ్రూప్ అడ్మిన్లకు పేపర్
న్యూఢిల్లీ, జూన్ 21: ఇటీవల రద్దయిన యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ కేంద్రంగా లీకైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఒక్కో పేపర్ రూ.5 వేల నుంచి రూ.10 వేలకు విక్రయించినట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ అధీనంలోని ఐ4సీ నివేదిక ఆధారంగా యూజీసీ నెట్‌ను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. టెలిగ్రామ్‌లో ప్రశ్నాపత్రం లీకైందని, కనీసంగా రూ.5 వేలకు విక్రయిస్తున్నట్లు ఐ4సీ అధికారులు గుర్తించి విద్యాశాఖకు సూచించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పేపర్‌ను విక్రయించిన బృందాన్ని కూడా అధికారులు గుర్తించినట్లు వెల్లడించాయి.
అంతేకాకుండా ఈ పేపర్లు వివిధ గ్రూపుల్లో షేర్ చేసినట్లు గుర్తించినట్లు పేర్కొన్నాయి. కాగా, టెలిగ్రామ్ గ్రూపుల అడ్మిన్లకు పేపర్ ఎక్కడి నుంచి పొందారనేది ఇంకా అధికారులు గుర్తించలేదు. డార్క్‌వెబ్ ద్వారా వచ్చినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోన్న సమయంలోనే యూజీసీ నెట్ పరీక్ష రద్దు కావడం చర్చనీయాంశమైంది. పేపర్ లీకేజీని ప్రస్తావించకుండా పరీక్ష సమగ్రతపై రాజీ పడబోమని చెబుతూ కేంద్ర విద్యాశాఖ రద్దు చేసింది. ఈ విషయంలో దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించింది.






