21 April, 2026 | 5:04 AM

కేసముద్రం మార్కెట్లో యథావిధిగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు

21-04-2026 03:28 AM

కేసముద్రం, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): మార్క్ ఫెడ్ ఎఫెక్ట్.. మార్కెట్లు బంద్’ శీర్షికతో కేసముద్రం మార్కెట్ లో ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు నిలిపివేసిన ఘటనపై ‘విజయక్రాంతి’ పత్రికలో ఈనెల 15న ప్రచురించిన వార్తా కథనానికి మార్కెట్ కమిటీ స్పందించింది. మార్కెట్లో సుమారు 50వేల బస్తాలకు పైగా మక్కలు పేరుకుపోవడంతో మార్కెట్లో ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపివేశారు.

ఈ విషయంపై ‘విజయక్రాంతి’లో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ వార్తా కథనం ప్రచురించగా మార్కెట్ పాలకమండలి స్పందించింది. మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి గత ఐదు రోజులుగా మార్కెట్లో అధికారులతో సమీక్షలు నిర్వహించి, నిరంతరం పర్యవేక్షిస్తూ మార్కెట్లో మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేసి పేరుకు పోయిన 50 వేల బస్తాల మక్కలకు పూర్తిగా కాంటాలు నిర్వహించి గోదాముకు ఎగుమతి చేసి యార్డులో నిలువలను పూర్తిగా క్లియర్ చేశారు. 

తాజాగా మార్కెట్లో మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా మక్కలను కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా షెడ్లు కేటాయించి, ఒక్కసారిగా రైతులు మక్కలను విక్రయానికి తేకుండా గ్రామాల వారీగా తేదీలను ప్రకటించారు. దీనితో మార్కెట్ పై మక్కల ఒత్తిడి తగ్గిపోయింది.

సోమవారం నుండి యధావిధిగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పసుపు, ధాన్యం, అపరాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను పునరుద్ధరించారు. ఇతర పంటలు పండించిన రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించడానికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఇక ఏ ఇబ్బంది ఉండకుండా చర్యలు తీసుకున్నామని మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కార్యదర్శి అమరలింగేశ్వరరావు తెలిపారు.