32కు చేరిన రాజ్‌కోట్ మృతులు
బయటకు ఒకే దారి ఉండటంతోనే దారుణం
భారీగా ఇంధనం నిల్వచేయటంతో భారీగా మంటలు
ఇలాంటివి ప్రజా భద్రతకు ప్రమాదం: గుజరాత్ హైకోర్టు
రాజ్‌కోట్, మే 26: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గేమింగ్‌జోన్‌లో శనివారం సంభవించిన అగ్నిప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య 32కు చేరింది. వీరిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతదేహాలన్నీ మంటలకు కాలిపోయాయని చెప్పారు. రెండంతస్తుల ఈ నిర్మాణంలో కొంతభాగం తాత్కాలిక నిర్మాణమని, శనివారం సాయంత్రం 6 గం టలకు మంటలు చెలరేగగానే ఆ నిర్మాణం కుప్పకూలి చాలామంది అందులో చిక్కుకుపోయారని వెల్లడించారు. అగ్నిప్రమాదం సమయంలో గేమింగ్ జోన్‌లో 300 మంది వరకు ఉన్నారని అంచనా. అయితే, ఈ భవనం నుంచి బయటకు వెళ్లేందుకు, లోపలికి వచ్చేందుకు ఒకటే దారి ఉన్నట్టు గుర్తించారు. మంటలు చెలరేగిన వెంటనే ఆ దారిలోంచి అందరూ వెళ్లలేక చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. ‘తాత్కాలిక నిర్మాణం కుప్పకూలటంతో బయటకు వెళ్లే దారి మూసుకుపోయింది. దీంతో భవనం పైకప్పునుంచి బయటకు రావటానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో మంటలకు ఆహుతయ్యారు’ అని రాజ్‌కోట్ అగ్నిమాక ప్రధాన అధికారి ఐలేశ్ ఖేర్ వివరించారు. యువరాజ్‌సింగ్ సోలంకీ అనే వ్యక్తి అద్దెకు తీసుకొన్న స్థలంలో ఈ గేమింగ్ జోన్‌ను నడుపుతున్నట్టు గుర్తించారు. అతనితోపాటు మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
హైకోర్టు ఆగ్రహం
ఈ అగ్నిప్రమాదంపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి జస్టిస్ బీరేన్ వైష్ణవ్, జస్టిస్ దేవన్ దేశాయ్‌తో కూడిన ధర్మాసనం ఆదివారం విచారణ చేపట్టింది. ప్రమాదంపై పూర్తి నివేదిక ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వాన్ని, రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో ఏ చట్టాన్ని అనుసరించి గేమింగ్‌జోన్లు, రిక్రియేషనల్ సౌకర్యా లు ఏర్పాటుచేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది. గుజరాత్ కాంప్రహెన్సివ్ జనరల్ డెవలప్‌మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్ (జీడీసీఆర్)లోని లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమంగా ఇలాంటి గేమింగ్ జోన్లు వెలుస్తున్నాయని వార్తలు వెలువడటంతో ధర్మాసనం విస్మయం వ్యక్తంచేసింది. ఈ విపత్తు మనిషి సృష్టించిందేనని మండిపడింది.






