21 March, 2026 | 2:38 AM

గతేడాది బడ్జెటే

21-03-2026 12:56 AM
  1. డిప్యూటీ సీఎం పొరపాటున చదివారేమో!
  2. ఫాల్స్, ఫెయిల్డ్, ఫ్యాన్సీ బడ్జెట్!
  3. రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అని,- ఒక ఫెయిల్డ్, ఫాల్స్, ఫ్యాన్సీ బడ్జెట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. 2026--27 వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని తెలిపారు. ఆర్థికమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహుశా పొరపాటున గత ఏడాది బడ్జెట్‌నే చదివారేమో అన్న అనుమానం కలుగుతోందని, పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవని ఎద్దేవా చేశారు.

శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బడ్జెట్‌పైనా ఆయన స్పందించారు. ముఖ్యంగా విద్యారంగానికి ఈ బడ్జెట్‌లో తీరని అన్యాయం జరిగిందని తెలిపారు.  ఓవరాల్ బడ్జెట్‌లో దీని వాటా కేవలం 8 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (13 శాతం), బీహార్ (21 శాతం) తమ బడ్జెట్‌లో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతలో సగం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేద న్నారు. ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు అని గొప్పలు చెప్ప డం తప్ప, విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ఒక్క ప్రయత్నం కూడా కనిపించడం లేదన్నారు.

ఆరోగ్యశ్రీ బకాయిలే ఇంకా చెల్లించలేని రేవంత్ ప్రభుత్వం, పెన్ష న్లు, ఇతర బెనిఫిట్లను కూడా ఆరోగ్యశ్రీ డిపార్ట్‌మెంట్‌కే అప్పగించడం అంటే ఆ సంస్థను కూడా దివాళా తీయించడమేనని హెచ్చరించారు. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో చెప్పకుండా ఫ్యూచర్ సిటీ అని ఫ్యాన్సీ పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకుంటున్న ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అన్నీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా పథకాల వల్ల వచ్చినవేనని స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రోడ్ , దాని పక్కన వచ్చే రీజనల్ రింగ్ రైల్ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఫండింగ్ అని, కేవలం భూసేకరణ తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పంపే ప్రతి పైసా నేరుగా పేదవాడి ఖాతాకే చేరుతోందని అన్నారు.

ప్రతి రైతుకి రూ.45 వేలు బాకీ..

రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతోందని రాంచందర్ రావు మండిపడ్డారు. ఐదు దఫాలుగా రైతు భరోసా ఇవ్వాల్సి ఉండగా, సరిగ్గా ఇవ్వకుండా..  ప్రతి రైతుకు ఇంకా సుమారు ఎకరాకు రూ. 45,000కి పైగా బాకీ పడి ఎగ్గొట్టారని విమర్శించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ. 4,000 నిరు ద్యోగ భృతి కానీ, మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 ఆర్థిక సాయం గురించి కానీ ఈ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ఈ బడ్జెట్‌లో చోటు లేకపోవడం ప్రజలను వంచించడమేనని, బడ్జెట్‌తో ప్రజలకు చెవిలో పువ్వు పెట్టారన్నారు.

రెండు రోజుల్లోనే రూ.2వేల కోట్లు పెంపు..

కాంగ్రెస్ సర్కారు మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమర్జెన్సీ కాలంలో సంజయ్ గాంధీ ఢిల్లీలో తుర్క్‌మన్ గేట్ వద్ద పేదల ఇళ్లు కూలగొట్టిన మైండ్ సెట్‌తోనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు. మూసీ ప్రాజెక్ట్ వ్యయం రెండు రోజుల్లోనే రూ. 5,000 కోట్ల నుండి రూ. 7,000 కోట్లకు ఎలా పెరిగిందని రాంచందర్ రావు నిలదీశారు.

ఇదంతా ఒక ప్లానింగ్‌లేని విధానమని, కేవలం దోచుకోవడానికేనని ఆరోపించారు. దేవాలయాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని  విమర్శించారు. అర్చకుల వేతనాలు పెంచాలని, ధూప దీప నైవే ద్యాలకు బడ్జెట్ పెంచాలన్న డిమాండ్లను పట్టించుకోకుండా, కేవలం మైనారిటీ బడ్జెట్‌ను రూ. 700 కోట్లు పెంచడం ఓటు బ్యాంక్ పాలిటిక్స్‌లో భాగమేనన్నారు. 

హైదరాబాద్‌కు గుండు సున్నా..

హైదరాబాద్ నగరాన్ని మూడు ముక్కలు చేశారని, నగరానికి బడ్జెట్‌లో గుండు సున్నా ఇచ్చారని ఆయన విమర్శించారు. జీహెచ్‌ఎంసీకి బడ్జెట్ కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించా రు. ఓవరాల్‌గా ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని, పేదలకు దూరంగా ఉన్న ఈ ఫెయిల్ బడ్జెట్‌ను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.