విద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం
- మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
- డీసీపీని తొలగించడంపై ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండిస్తూ ఆయన శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి, యువతకు, విద్యార్థులకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. శాంతియుత నిరసనలను అణచివేయడానికి పోలీసు బలగాలను వినియోగించడం అత్యంత దురదృష్టకరమన్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లాఠీచార్జ్ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కక్షపూరిత చర్యలను సహించం..
ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు ‘మెటా’ పలు సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన హైదరాబాద్ డీసీపీని కాంగ్రెస్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించడం కక్షపూరిత చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని పాటిస్తూ, తన విధిని నిర్వర్తించిన అధికారిని తొలగించడం ఖండిస్తున్నట్లు రాంచందర్‌రావు అభివర్ణించారు.






