తెలంగాణలో ప్రమాదంలో శాంతిభద్రతలు
- పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి
గంజాయి మత్తులో దారుణం
ఎమ్మెల్యే పాల్వాయి హరీష్
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమా దంలో ఉన్నాయని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడని, నిందితుడు గంజాయి తీసుకోవ డంతోనే ఆ దారుణానికి పాల్పడ్డాడన్నారు.
ఈకేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితుడికి ఉరి శిక్ష వేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో పనిచేసేందుకు వచ్చిన వలస కూలీల సమాచారం సేకరించడంలో ఇక్కడి పోలీసులు విఫలమయ్యారని మండి పడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి లభ్యమవుతుందన్నారు. వలసల జిల్లాగా పేరున్న పాల మూరు నుంచి వచ్చానని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, వలసల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. చిన్నారిపై లైంగిక దాడి విషయంలో సామాజిక, ఆర్థిక కోణాలూ దాగి ఉన్నాయన్నారు.
వలసలను అరికట్టడం లో రాష్ట్రప్రభుత్వం విఫలమువుతోందన్నారు. మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇటీవల హైదరాబాద్‌లో పట్టుబడిన గంజాయి చాక్లెట్ల పట్టివేత గురించి ఏం సమాధానం చెప్తారన్నారు. అలాగే నీట్ అవకతవలపై సమగ్ర విచారణ జరగాల్సి ఉందని, కేవలం ఎన్టీఏపై బట్టకాల్చి వేయడం తగదన్నారు.






