calender_icon.png 8 August, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం

06-08-2024 01:29:14 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆయన జీవితాన్ని అర్పించారన్నారు.

తెలంగాణ సమాజం సదా ఆయన త్యాగాన్ని గుర్తుంచుకుంటుందని కొనియాడారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్రాలో విలీనం చేయాన్ని సార్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనంతో ఇక్కడి ప్రజలు మరింత నష్టపోయారని, సార్ వాటన్నింటినీ ఎండగట్టారన్నారు. సార్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఆయన ఆశయ సాధనకు తమ  ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 

ప్రజల గుండెల్లో ‘సార్’: మంత్రి కొండా

ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని మంత్రి కొండా సురేఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ప్రజల్లో రగిలించిన మహావ్యక్తి సార్ అని కొనియాడరాఉ.

‘సార్’ త్యాగం మరువలేనిది: కేసీఆర్  

ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సాధన కోసం చేసిన త్యాగం మరువలేనిదని, ఆయన స్ఫూర్తి అజరామరమని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తొలి దశ నుంచి మలి దశ ఉద్యమం వరకు ఆయన సేవలు అనిర్వచనీయమన్నారు. భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించారు.

తాను వారి అడుగుజాడల్లో మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించానని గుర్తుచేసుకున్నారు. శాంతియుత పద్ధతి, పార్లమెంటరీ పంథాలో ప్రజాఉద్యమాన్ని  కొనసాగించి తెలంగాణ సాధించామన్నారు. సార్ స్ఫూర్తితోనే తమ పార్టీ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిందన్నారు.