06-08-2024 01:38:16 AM
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): సర్కారు బడుల పరిశుభ్రతకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించింది. పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గ్రాంటు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పాఠశాలల పరిశుభ్రత బాధ్యత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించింది. పాఠశాలలు, మరుగుదొడ్ల పరిశుభ్రత కోసం స్కావెంజర్లను నియమించిన గత ప్రభుత్వం కొవిడ్ సంక్షోభం తర్వాత తొలగించింది. దీంతో పాఠశాలల పరిశుభ్రత సమస్యగా మారడంతో ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్‌ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
పాఠశాలల నిధులకు అదనంగా దీనిని కేటాచించినటుఉ్ట తెలిపింది. ఈ గ్రాంట్ నుంచి కేవలం పారిశుద్ధ్యంకు సంబంధించిన వారికి గౌరవ భత్యం చెల్లించడానికి వాడాలని సూచించింది. గౌరవ భత్యం అనేది వ్యక్తికి కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి పేమెంట్ చేయాలి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కేటాయింపులు ఇలా..
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలకు నెలవారీగా గ్రాంటును కేటాయించారు. 30 మందిలోపు విద్యార్థులుంటే రూ.3 వేలు, 100 లోపుంటే రూ.6 వేలు కేటాయించారు. కపిష్ఠంగా రూ.3 వేలు, 750 కంటే ఎక్కువ విద్యార్థులుంటే ఆ స్కూళ్లకు రూ.20 వేల చొప్పున గ్రాంటును ఇవ్వనున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ౧౦ నెలల కాలానికి నిర్ధేశించిన గ్రాంట్ నేరుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. క్లీనింగ్, స్వీపింగ్ మొదలైన వాటికి అవసరమైన మెటీరియల్ ఖర్చు సమగ్ర శిక్ష కింద పాఠశాలలకు విడుదల చేసిన కంపోజిట్ స్కూల్ గ్రాంట్ నుంచి తీసుకోవాలని సూచించారు.
స్కావెంజర్లను నియమించకుండా!
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 28 వేల ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులకు ఔట్ సోర్సింగ్ సర్వీస్ పర్సన్స్ (స్కావెంజర్లు) పేరిట పనిచేసేవారు. వీరికి నెలకు గౌరవ వేతనం కింద రూ.2500 ఇచ్చేవారు. అయితే కొవిడ్ సమయంలో విద్యాసంస్థలు మూసివేయడంతో వీరిని అప్పట్లో తొలగించారు. అనంతరం పాఠశాలల ఆవరణలో మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాలల్లో మొక్కలకు నీరు పోయడం వంటివి గ్రామీణ పాఠశాలల బాధ్యతలు పంచాయతీరాజ్‌శాఖకు, పట్టణాల్లోని పాఠశాలల బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అప్పగించడంతో ఆయా శాఖలు సమర్థవంతంగా నిర్వహించకపోవడంతో సమస్యగా మారింది.
కొన్ని చోట్ల టీచర్లే తలా కొంత మొత్తం వేసుకొని స్కావెంజర్లను నియమించుకొని మరుగుదొడ్ల శుభ్రత పనులు చేయించుకునేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలనే విజ్ఞప్తి మేరకు తాజాగా ప్రభుత్వం స్కావెంజర్లను నియమించకుండా పరిశుభ్రత బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించింది. ఒకవేళ స్కావెంజర్లను నియమిస్తే భవిష్యత్తులు గౌరవ వేతనం పెంచాలని, పర్మినెంట్ చేయాలనే డిమాండ్ రాకుండా ఉండేందుకే ఈవిధంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
సర్కారు నిర్ణయంపై ఎస్టీయూ హర్షం
టీచర్ల ముఖాముఖి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన మేరకు పాఠశాల సౌకర్యాల నిర్వహణ గ్రాంట్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఎస్టీయూ సంఘం హర్షం వ్యక్తం చేసింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా కార్మికులకు గౌరవ వేతనం చెల్లించేలా నిర్ణయం తీసుకోవడం సంతోషించదగ్గ విషయమని నాయకులు ఎం పర్వత్ రెడ్డి, సదానందంగౌడ్ తెలిపారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు త్వరలో సర్కారు బడులకు ఉచిత విద్యుత్ చెల్లించే ఉత్తర్వులను విడుదల చేసే అవకాశం ఉందన్నారు.
సీఎం మాటంటే మాటే
టీచర్ల సభలో బడుల పరిశుభ్రతపై నిర్ణయం తీసు కుంటామని సీఎం ప్రకటించారు. మాట ప్రకారం వెంటనే అందు కు సంబంధించి ఉత్తర్వు లు విడుదల చేయడం పాఠశాల విద్యపై ఆయనకు ఉన్న శ్రద్ధకు నిదర్శనం.
జగదీశ్, ఆర్‌యూపీపీ అధ్యక్షుడు